బెయిల్ పిటిషన్లను వెంటనే పరిష్కరించండి.. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో కింది కోర్టుకు హైకోర్టు సూచన

బెయిల్ పిటిషన్లను వెంటనే పరిష్కరించండి.. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో కింది కోర్టుకు హైకోర్టు సూచన

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ చేశారంటూ రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారి చక్రధర్‌‌ గౌడ్‌‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీశ్‌‌రావుతో సహా ఇతరులపై నమోదు చేసిన కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్లను త్వరగా పరిష్కరించాలంటూ కింది కోర్టుకు మంగళవారం హైకోర్టు సూచించింది. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌పై రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అక్రమంగా అరెస్ట్‌‌ చేశారని, బెయిలివ్వాలంటూ సిమ్‌‌కార్డుల సేల్స్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ సంతోశ్ కుమార్, సిద్దిపేట తడ్కపల్లికి చెందిన రైతు పరశురాములు హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌ రెడ్డి విచారించారు. 

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో మొదటి నిందితుడైన హరీశ్‌‌రావుతో పాటు మరో నిందితుడైన రాధాకిషన్‌‌ రావుకు అరెస్ట్‌‌ నుంచి రక్షణ కల్పిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. పోలీసులు తమను అక్రమంగా అరెస్ట్‌‌ చేశారని చెప్పారు. తమను విచారణకు పిలిచి అరెస్ట్‌‌ చేశారని, బెయిలుపై విడుదల చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్లు కింది కోర్టులో పెండింగ్‌‌లో ఉన్నందున వాటిపై త్వరగా విచారించి నిర్ణయం వెలువరించాలని సూచించారు.