- రాష్ట్ర సర్కారుకు హైకోర్టు సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వినియోగదారుల కమిషన్ చైర్మన్ నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం లేదని ఇదివరకే స్పష్టం చేసినట్లు గుర్తు చేసింది. చైర్మన్ నియామకంపై నిర్ణయమేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది.
తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ చైర్మన్ పోస్టును భర్తీ చేయకపోవడంపై హైదరాబాద్‌కు చెందిన లాయర్ బగ్లేకర్ ఆకాశ్ కుమార్ వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి పోస్టు ఖాళీగానే ఉందని పిటిషనర్ లాయర్ కోర్టుకు తెలిపారు. చైర్మన్ నియామకానికి సంబంధించిన వివరాలు సమర్పించేందుకు తమకు మరికొంత గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో ఇదే చివరి అవకాశమని చెప్పిన హైకోర్టు.. విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.