- కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం.. విచారణ ఈ నెల 28కి వాయిదా
హైదరాబాద్, వెలుగు:డీఎస్సీ (టీఆర్‌టీ) ఎగ్జామ్స్‌వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. గురువారం నుంచి ఎగ్జామ్స్ మొదలయ్యాయని, ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని గుర్తు చేసింది. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరిగాయని, పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయని, ఈ పరిస్థితుల్లో వాయిదా వేయరాదన్న ప్రభుత్వ అభ్యర్థనను ఆమోదించింది.
పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ప్రస్తావించిన అభ్యంతరాలపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ పుల్లా కార్తీక్ గురువారం ప్రకటించారు. డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ వికారాబాద్‌కు చెందిన ఆర్.అశోక్ మరో తొమ్మిది మంది పిటిషన్ వేశారు. వీరి తరఫున సీనియర్ అడ్వకేట్ ఎల్.రవిచందర్ వాదిస్తూ.. నోటిఫికేషన్‌కు పరీక్షలకు మధ్య ఎక్కువ సమయం లేదన్నారు. పరీక్షలకు రెడీ అయ్యే వాళ్లకు ఇబ్బందిగా ఉందన్నారు.
పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరారు. ఏడేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడిందని, టీచర్ల అర్హత పరీక్షలు ప్రతి ఏటా నిర్వహిస్తుండగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు చాలాకాలం అయ్యిందన్నారు. పరీక్షల వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. దీనిపై ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదిస్తూ, ఇప్పటికే 2.45 లక్షల మంది హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని, గురువారం నుంచి పరీక్షలు మొదలయ్యాయని చెప్పారు.
ఈరోజు 81.61 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారన్నారని, నోటిఫికేషన్‌కు పరీక్షల నిర్వహణకు మధ్య 8 వారాల గడువు ఉందన్నారు. కేవలం పది మంది పిటిషనర్ల కోసం పరీక్షల వాయిదా సబబుకాదన్నారు. రవిచందర్ కల్పించుకుని, కోర్టు ఉత్తర్వులకు లోబడి డీఎస్సీ ప్రక్రియ ఉండేలా షరతు విధించాలని కోరగా అందుకు రజనీకాంత్ వ్యతిరేకించారు. ఆ తరహా మధ్యంతర ఆదేశాలు వెలువడితే పరీక్షలు రాసే వాళ్లు టెన్షన్‌కు గురవుతారని చెప్పారు.
వాదనల తర్వాత న్యాయమూర్తి, పిటిషనర్లు తమ హాల్‌టిక్కెట్లను పిటిషన్‌లో జత చేయకపోవడాన్ని ప్రస్తావించారు. వాటిని పిటిషనర్లు సమర్పించాలని, ప్రభుత్వం కౌంటర్ వేయాలని ఆదేశించారు.