మూసీలో కూల్చివేతలపై  స్టేకు హైకోర్టు నిరాకరణ...నోటీసుల జారీ తర్వాతే చర్యలు: ప్రభుత్వం

మూసీలో కూల్చివేతలపై  స్టేకు హైకోర్టు నిరాకరణ...నోటీసుల జారీ తర్వాతే చర్యలు: ప్రభుత్వం
  • పరిహారం ఇచ్చాకే కూల్చివేతలని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైడ్రా, మూసీ రివర్‌‌ బెడ్‌‌లో నిర్మాణాల కూల్చివేత చర్యలను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నోటీసులు జారీ చేశాకే ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నందున మధ్యంతర స్టే ఆదేశాలు అవసరం లేదని స్పష్టం చేస్తూ.. కౌంటర్‌‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైడ్రాను ఆదేశించింది. మూసీలో కూల్చివేతలను, హైడ్రా చేపట్టిన కూల్చివేతలను వెంటనే ఆపేలా ఆదేశించాలంటూ ప్రజా శాంతి పార్టీ చీఫ్‌‌ కేఏ పాల్‌‌ పిల్‌‌ వేశారు.

దీనిని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.శ్రీనివాస్‌‌రావుల డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారించింది. కేఏ పాల్‌‌ వాదిస్తూ.. బఫర్ జోన్, ఎఫ్‌‌టీఎల్‌‌ అని తెలీక కేవలం అనుమతులు ఉన్నాయనే పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇండ్లు కొన్నారని కోర్టుకు తెలిపారు. ఎవరో చేసిన పాపానికి అమాయకులు  ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 462 నిర్మాణాలు, భవనాలకు నోటీసులు ఇవ్వకుండా  కూల్చివేశారు. నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌‌ కన్వెన్షన్‌‌ను ఒక్క రోజులో కూల్చిన అధికారులు.. తర్వాత దాదాపు 250 మంది పెద్దలకు నోటీసులు జారీ చేసి చర్యలు చేపట్టలేదన్నారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు గడువు ఇవ్వలేదన్నారు. తాను అక్రమ నిర్మాణాల కూల్చడానికి వ్యతిరేకం కాదని, చర్యలు చట్ట ప్రకారం ఉండాలన్నదే తమ వాదనని చెప్పారు. న్యాయవాదులను పెట్టుకోలేని స్థితిలో చాలా మంది బాధితులు ఉన్నారని.. హైడ్రా వల్ల లక్షల మంది భయపడుతున్నారని వివరించారు. నోటీసులు జారీ చేశాక వారికి ఇళ్లను ఖాళీ చేసేందుకు లేదా కోర్టులో న్యాయపోరాటం చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఇళ్ల కూల్చివేతపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని పాల్‌‌ వాదించారు. 

బాధితుల సమ్మతితోనే కూల్చివేతలు

ప్రభుత్వం తరఫున అడిషనల్‌‌ అడ్వొకేట్‌‌ జనరల్‌‌(ఏఏజీ) ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ వాదిస్తూ.. పరిహారంపై చర్చించాక బాధితులు సమ్మతించిన తర్వాతే ఇళ్ల కూల్చివేత చేపడుతున్నామని కోర్టుకు తెలిపారు. ‘‘ చట్టప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తోంది. నోటీసులిచ్చి సమయమిచ్చిన తర్వాతే కూల్చివేతలు చేపడుతున్నాం. సిటిజన్లలందరికీ ఒకేలా వ్యవహరిస్తున్నాం.

తారతమ్యాలు లేవు. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఏర్పాటైంది. రివర్‌‌ బెడ్‌‌లోని ఇళ్లకు మార్కింగ్‌‌ మాత్రమే చేశాం.  ఇంకా కూల్చివేతలు చేపట్టలేదు. హైడ్రాకు చట్టబద్ధత ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఆర్డీనెన్స్‌‌ జారీ చేసింది’’ అని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏఏజీ వాదనలను రికార్డు చేశామని, మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.