
- అది ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎస్జీటీల ప్రమోషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎస్జీటీలకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో ఎస్ఏ పోస్టులను కేటాయించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని తేల్చి చెప్పింది. విధాన నిర్ణయాల్లో కోర్టుల జోక్యానికి ఆస్కారం తక్కువని చెప్పింది. ఎస్ఏ పోస్టుల భర్తీలో 1999 నాటి జీవో 108ని అమలు చేయడం అన్యాయమంటూ కిరణ్‌కుమార్ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ ఎన్.నర్సింగ్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది.
ఎస్జీటీ టీచర్లకు పదోన్నతులు, ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి దేవేశ్ శర్మ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జరు గుతున్నాయని న్యాయవాది వాదించారు. స్కూలు అసిస్టెంట్ పోస్టుల్లో ప్రమోషన్ల ద్వారా ఎస్జీటీలకు 20 శాతం అంతకంటే తక్కువగా ఉండేలా చూడాల న్నారు. ప్రత్యక్ష నియామకాల ద్వారా 80 శాతం అంతకంటే ఎక్కువగా ఉండాలన్నారు. ఖాళీలను నోటిఫై చేసి డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రస్తుతం ఎస్ఏ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా 33.33 శాతం, ఎస్జీటీలకు పదోన్నతులు, బదిలీల ద్వారా 66.66 శాతం భర్తీ చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమని తెలిపింది. ఎస్జీటీ పదోన్నతులు ప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగమని చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన నిష్పత్తిని మార్పాలని తాము ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. పిటిషనర్లు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చునని సూచించింది. పిటిషన్లపై విచారణను మూసేసింది.