హైదరాబాద్: కేడర్ కేటాయింపు కేసులో ఏపీకి పోవాలన్న తీర్పుపై మరో అవకాశం కోసం సీఎస్ సోమేష్ కుమార్ తరపున ప్రయత్నాలు జరిగాయి. సోమేష్ కుమార్ ఇక ఏపీకి పోవాల్సిందేనని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందా బెంచ్ స్పష్టంగా తీర్పునిచ్చింది. అయితే అప్పీలుకు పోవడానికి వీలుగా ఈ తీర్పుపై మూడు వారాల స్టే ఇవ్వాలని సోమేష్ కుమార్ తరపు అడ్వొకేట్లు బెంచ్ ను కోరారు. అయితే దీన్ని సీజే బెంచ్ సూటిగా రిజెక్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో చాలా వాదనలు జరిగాయి. చాలా అంశాలపై చర్చ జరిగింది. బీహార్-జార్ఖండ్ లో కేడర్ కేటాయింపు కేసుల్లో వచ్చిన తీర్పులను కూడా హైకోర్టు పరిశీలించింది. దీంతో అన్నీ బాగా లోతుగా స్టడీ చేశాకే తీర్పు చెప్పామని జడ్జిమెంట్ చివరిలో బెంచ్ కామెంట్ చేసింది. అందువల్ల దీనిపై తాత్కాలికంగా కూడా స్టే ఇచ్చే ఆలోచన ఏ మాత్రం లేదని తేల్చిచెప్పేసింది. సీఎస్ సోమేష్ కుమార్ ఇంకా ఏదో రకంగా తెలంగాణలో కొనసాగే చివరి అవకాశం కూడా అయిపోయినట్లేనని సీనియర్ అడ్వొకేట్లు చెబుతున్నారు. స్టే ఇవ్వకపోవడం వల్ల ఆయన వెంటనే ఏపీకి పోక తప్పని పరిస్థితి ఉందంటున్నారు.
హైకోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ వచ్చాక దాని ఆధారంగా సోమేష్ సుప్రీంలో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. సుప్రీంలో విచారణకు కేసు లిస్టై ముందుగా స్టే ఇస్తే తప్ప ఆయనకు ఊరట దొరికే వీలు లేదు. అప్పటివరకు ఆయన ఏపీలోనే పనిచేయాల్సి వస్తుంది. సుప్రీంలో వెంటనే స్టే రాకుంటే ఇక ఆయన ఏపీ కేడర్ అధికారిగానే కొనసాగాల్సి ఉంటుంది. హైకోర్టు తీర్పులోనే బీహార్-జార్ఖండ్ కు చెందిన ఇంద్రదేవ్ పాశ్వాన్ కేసును బెంచ్ ప్రస్తావించింది. దాదాపుగా సోమేష్ కుమార్ కేసును పోలి ఉన్న ఈ వ్యవహారంలో అధికారికి వ్యతిరేకంగానే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జార్ఖండ్ ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేశానన్న కారణంతో ఆయన జార్ఖండ్ లోనే కొనసాగాలని భావించారు. అయితే ఆయనకు అలాట్ మెంట్ లో బీహార్ కేడర్ వచ్చింది. తన ఆప్షన్స్ ను తిరస్కరించడాన్ని సవాలుచేస్తూ ఆయన కోర్టుకెక్కారు. క్యాట్, హైకోర్టుల్లో భిన్నమైన తీర్పుల తర్వాత ఫైనల్ గా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సొంత కారణాలతో ఏకపక్షంగా కేడర్ అలాట్ మెంట్ కోరుకు హక్కు అధికారులకు ఉండదని తేల్చిచెప్పింది. చట్టపరమైన లోపాలుంటే తప్ప ఇట్లాంటి వాటిలో అసలు క్యాట్ కూడా జోక్యం చేసుకోవడానికి వీలులేదని సుప్రీం తీర్పు చెప్పింది. ఇదే తీర్పు ఆధారంగా సోమేష్ కేసులో రాష్ట్ర హైకోర్టు సీజే బెంచ్ తీర్పు ఇవ్వడం ఇంట్రెస్టింగ్.