ఇందిరమ్మ కమిటీల రద్దుకు హైకోర్టు నో..సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇవ్వలేమని వెల్లడి

ఇందిరమ్మ కమిటీల రద్దుకు హైకోర్టు నో..సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇవ్వలేమని వెల్లడి
  • సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇవ్వలేమని వెల్లడి
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ కమిటీలను రద్దుచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సింగిల్‌‌‌‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి అక్టోబర్‌‌‌‌ 11న జీవో 33 జారీ చేశారు. ఈ జీవోను సవాల్‌‌‌‌ చేస్తూ నిజామాబాద్‌‌‌‌ జిల్లా వేల్పూర్‌‌‌‌ మండలం కొత్తపల్లికి చెందిన ఆరె నితీశ్‌‌‌‌కుమార్‌‌‌‌తో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు.

నవంబర్‌‌‌‌ 14న దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌‌‌‌ జడ్జి.. పిటిషన్‌‌‌‌ను కొట్టివేశారు. ‘అర్హత ప్రమాణాల ప్రకారం లబ్ధిదారులను నిర్ధారిస్తారు. పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ, విచక్షణ ఉంటుంది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే తప్ప సర్కార్‌‌‌‌ విధాన నిర్ణయాల విషయంలో ఆర్టికల్ 226 ప్రకారం న్యాయపరమైన సమీక్ష పరిమితం’ అని పేర్కొన్నారు. అయితే, సింగిల్‌‌‌‌ జడ్జి తీర్పును సవాల్‌‌‌‌ చేస్తూ నితీశ్‌‌‌‌కుమార్‌‌‌‌ హైకోర్టులో అప్పీల్‌‌‌‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌‌‌‌పై జస్టిస్‌‌‌‌ సుజయ్‌‌‌‌పాల్‌‌‌‌, జస్టిస్‌‌‌‌ కె.శరత్‌‌‌‌ శుక్రవారం విచారణ చేపట్టారు.

ఎలాంటి అర్హతలు పేర్కొనకుండా సభ్యుల ఎంపిక చట్టవిరుద్ధమని పిటిషనర్‌‌‌‌ తరఫు లాయర్​వాదించారు. ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ ముగిసే వరకు ఇందిరమ్మ కమిటీలను నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషన్లు వేసే అర్హత వారికి లేదు. పథకాలను ఎలా అమలు చేయాలనే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

సింగిల్‌‌‌‌ జడ్జి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీర్పు వెల్లడించారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ దశలో కమిటీలను రద్దు చేయవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. కమిటీల రద్దుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్‌‌‌‌ వేయాలని సర్కార్‌‌‌‌ను ఆదేశిస్తూ, విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.