
- కోర్టు స్టేతో హెచ్‌సీయూలో సంబురాలు
గచ్చిబౌలి, వెలుగు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైకోర్టు రిజిస్ట్రార్ అధికారులతో కలిసి కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని సందర్శించారు. చెట్లను తొలగించిన భూమిలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హెచ్‌సీయూ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు హైకోర్టు రిజిస్ట్రార్‌ను కలిసి.. ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరుతో చెట్లను ధ్వంసం చేస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా అక్కడి దృశ్యాలను రిజిస్ట్రార్ ఫొటోలు, వీడియోలు తీసుకున్నట్టు తెలిసింది. కాగా, ఈస్ట్ క్యాంపస్ వైపు ఎవరినీ అనుమతించని పోలీసులు.. రిజిస్ట్రార్వచ్చే సమయంలో బారికేడ్లు తొలగించి, జేసీబీలను పంపించివేశారని విద్యార్థులు చెప్పారు. రిజిస్ట్రార్వెళ్లిపోయాక పోలీసులు ఈస్ట్ క్యాంపస్ వైపు దారిని తిరిగి మూసివేశారని, అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు ఆరోపించారు.
వర్షంలో విద్యార్థుల సంబురాలు
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ప్రభుత్వం ఎలాం టి పనులు చేపట్టకుండా గురువారం సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో హెచ్‌సీయూ విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. మెయిన్గేట్వద్ద వర్షంలో తడుస్తూ, పాటలు పాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది విద్యా ర్థుల విజయం’ అంటూ నినదించారు. కాగా, వర్సిటీలో గురువారం కూడా స్టూడెంట్ల ఆందోళన కొనసాగిం ది. మెయిన్ గేట్ వద్ద వివిధ విద్యార్థి సంఘాలు రిలే నిరా హారదీక్ష చేపట్టగా, ఏబీవీపీ నేతలు హెచ్‌సీయూ రెండో గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.