
- ఎన్టీఆర్ వీలునామాపైహైకోర్టు తీర్పు
- సివిల్ కోర్టు ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు:వీలునామాను ధ్రువీకరించిన ఇద్దరూ చనిపోయారని చెబితే సరిపోదని, దానికి సంబంధించి చట్టప్రకారం ధ్రువీకరణ జరగాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. చట్ట నిబంధనల ప్రకారం ధ్రువీకరణ జరగాలంది. అలాకాకుండా నేరుగా చనిపోయారంటూ వారి చేతిరాతను ధ్రువీకరించే విధానాన్ని అనుసరించడం సరికాదంది. ఎన్టీఆర్ వీలునామా ప్రకారం తనను బసవతారకం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలంటూ దాఖలు చేసిన లక్ష్మీపార్వతి పిటిషన్ లో ఎన్టీఆర్ వీలునామా ధ్రువీకరణలో ఇద్దరు అటెస్టర్లు చనిపోయారని,
అందులో ఒకరి కుమారుడైన జేవీ ప్రసాదరావును సాక్షిగా అనుమతించాలన్న సివిల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ బసవతారకం మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ తరఫున నటుడు నందమూరి బాలకృష్ణ ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ జి.రాధారాణి విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా లక్ష్మీపార్వతి తీసుకువచ్చిన జేవీ ప్రసాద్ సాక్ష్యం చెల్లదంటూ బసవతారకం ట్రస్ట్ పిటిషన్ ను అనుమతిస్తూ తీర్పు చెప్పారు.
ఇది గతం..
ఎన్టీ రామారావు 1995 నవంబరు 18నాటి వీలునామా ప్రకారం బసవతారకం మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని, ఇందులో ట్రస్ట్ సభ్యులు, అనుచరులు తన విధుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని లక్ష్మీపార్వతి సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు ఎన్టీఆర్ వీలునామాను ధ్రువీకరిస్తూ సాక్షులుగా జేవీ వెంకట సుబ్బయ్య, తిరుపపతిరావు సంతకం చేశారు. ప్రస్తుతం వారిద్దరు చనిపోయారు. దీంతో తిరుపతిరావు సంతకాన్ని ధ్రువీకరించడానికిగాను ఆయన కుమారుడు మాధవ్ ను రెండో సాక్షిగా అనుమతించాలని లక్ష్మీపార్వతి వేసిన దరఖాస్తును సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో 3వ సాక్షిగా జేవీ వెంకటసుబ్బయ్య కుమారుడు జేవీ ప్రసాద్ రావు అఫిడవిట్ దాఖలు చేస్తూ తన తండ్రి చనిపోయారని, ఎన్టీఆర్ వీలునామా తన సమక్షంలో జరిగిందన్నారు.
దీనిపై బసవతారకం ట్రస్ట్, బాలకృష్ణ, హరికృష్ణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సివిల్ కోర్టులో వేసిన దరఖాస్తును కొట్టివేసింది. వీలునామా ధ్రువీకరణదారులు ఇద్దరూ చనిపోయినందున మూడో సాక్షిగా జేవీ ప్రసాద్ ను నుమతిస్తున్నామని 2018లో ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బసవతారకం మెమోరియల్ ట్రస్ట్, బాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు, ఎవిడెన్స్ యాక్ట్ లోని సెక్షన్ 68 ప్రకారం విల్లును ధ్రువీకరించడానికి ప్రత్యేక పద్ధతులున్నాయని తేల్చి చెప్పింది. దీన్ని విస్మరించి సాధారణ పద్ధతుల ద్వారా విల్లును ధ్రువీకరించరాదని వెల్లడించింది. ధ్రువీకరణదారులు చనిపోయినట్లు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని తప్పు పట్టింది. వాళ్లు చనిపోయారని, వాళ్ల ఆచూకీలేదనిగానీ నిరూపించలేదని ఆక్షేపించింది. సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది.