
హైదరాబాద్, వెలుగు : అక్రమ ఆయుధాలు ఉన్నాయనే అభియోగంపై ముద్దునూరి శేషయ్య అలియాస్ శేషన్న/పెద్దన్నను పీడీ యాక్ట్ కింద పోలీసులు ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడాన్ని హైకోర్టు సమర్ధించింది. అతను తిరిగి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నదనే ప్రభుత్వ వాదనతో జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి శ్రీసుధలతో కూడిన డివిజన్ బెంచ్ ఏకీభవించింది. గతేడాది డిసెంబరులో శేషయ్యను పీడీ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ శేషయ్య భార్య నర్సమ్మ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ లాయర్ వాదిస్తూ..శేషయ్య తుపాకీని ఉపయోగించలేదని, పీడీ యాక్ట్ అన్యాయమని కోర్టుకు తెలిపారు. గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ ముజీబ్ కుమార్ వాదిస్తూ.. శేషన్నకు గ్యాంగ్‌స్టర్ నయీమ్ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆయుధాలతో రియల్‌ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నాడని వివరించారు. వాదనలు విన్న కోర్టు...శేషయ్య ముందస్తు నిర్బంధాన్ని సమర్థించింది. అతని భార్య వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.