
బాలీవుడ్ స్టార్ హీరోలైన అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్, షారుఖ్ ఖాన్ తదితరులకు జైపూర్ జిల్లా పౌర సరఫరాల శాఖ షాక్ ఇచ్చింది. మార్చ్ 19న(బుధవారం) కోర్టు విచారణకి హాజరు కావాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ విషయం బాలీవుడ్ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్, షారుఖ్ ఖాన్ తదితరులు కొన్నేళ్లుగా జేబీ ఇండస్ట్రీస్ ఉత్పత్తులైన విమల్, పాన్ గుట్కా మసాలా తదితర వాటిని ప్రమో చేస్తున్నారు. యాడ్ ట్యాగ్ లైన్ "దానే దానే మే హై కేసర్ కా దమ్" (ప్రతి గింజలో కుంకుమపువ్వు బలం ఉంటుంది) అని ఉంది. పలుకులలో కేసరి అంటూ తెలుగులో కూడా డబ్బింగ్ చేసి మరీ ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై జైపూర్ కి చెందిన యోగేంద్ర సింగ్ బడియాల్ అనే వ్యక్తి డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరంలో కంప్లైంట్ చేశాడు.
ఇందులోభాగంగా గుట్కా ప్రమోషన్స్ లో కుంకుమ పువ్వు వినియోగిస్తున్నట్లు చెబుతున్నారని, కానీ ఒక కేజీ కుంకుమ పువ్వు ధర దాదాపుగా రూ.4 లక్షల పైనే ఉంటుందని అలాంటిది రూ.5 రూపాయలకి దొరికే గుట్కాలో ఎలా ఇస్తారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ ప్రాడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ కుంకుమ పువ్వు పేరుతో స్టార్ హీరోలు మిస్ లీడ్ చేస్తున్నారని, కాబట్టి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అంతేకాకుండా పొగాకు ప్రాడక్ట్స్ కారణంగా చాలామంది క్యాన్సర్ భారిన పడుతున్నారని కాబట్టి దేశంలో వీటిని నిషేదించాలని తెలిపాడు.
దీంతో ఈ ఫిర్యాదును విచారిస్తూ కమిషన్ చైర్మన్ గైర్సిలాల్ మీనా, సభ్యురాలు హేమలత అగర్వాల్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. మరి కోర్టు నోటీసులకు ఈ స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య సినీ సెలబ్రేటీలు డబ్బు కోసం ఇలాంటి హానికరమైన ప్రాడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఇకనైనా ఆపాలని కోరుతున్నారు. వీటితోపాటూ కొనికొన్ని మద్యం తయారు సంస్థలు కూడా తమ బ్రాండ్స్ ని పేర్లు మర్చి ప్రమోట్ చేస్తున్నారని కాబట్టి వాటిపై కూడా దృష్టి సారించాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.