అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోరుతూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరినట్లు జగన్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం.
ప్రతిపక్ష హోదాకు సంబంధించిన రూల్ పొజిషన్ వివరాలను న్యాయస్థానం ముందు పెట్టాలని వెల్లడించింది కోర్టు. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.కక్షపూరితంగానే ప్రతిపక్ష హోదాను ఇవ్వడం లేదని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేతగా స్పీకర్‌కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించగా... గత నెల 24న ఇచ్చినట్లు జగన్ తరఫు న్యాయవాది సమాధానం ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.
గత ఎన్నికల్లో టీడీపీ కూటమికి 164 స్థానాలు రాగా వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్..స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేతతో ప్రమాణస్వీకారం చేయాలని కానీ అలా జరగలేదని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు.