- ప్రభుత్వం గొప్పలు చెప్పుడేగానీ చర్యలు తీస్కుంటలే : హైకోర్టు
- సర్కారు గొప్పలు చెప్పుడేగానీ చర్యలు తీస్కుంటలేదని హైకోర్టు సీరియస్
- సంపన్నులకు కార్పొరేట్ ఆస్పత్రులున్నయ్.. సర్కారు దవాఖాన్లకు తప్ప పేదలు ఇంకెక్కడికి పోతరు?
- 5 ఫ్లోర్ల బిల్డింగ్‌లో మూడంతస్తులు ఖాళీగా ఎందుకుంచిన్రు?
- ప్రెగ్నెంట్లతో వచ్చే అటెండెంట్ల కోసం కట్టిన షెల్టర్‌కు తాళం ఎందుకు?
- వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు నామమాత్రంగా ఉన్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చెప్తున్నదానికి, తీసుకున్న చర్యలకు పొంతన లేదని అభిప్రాయపడింది. సమస్యల్ని నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని మెడికల్ అండ్ హెల్త్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. సంపన్నులకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయని, పేదలు ప్రభుత్వ దవాఖాన్లకు తప్ప ఇంకెక్కడికి పోతరని ప్రశ్నించింది. ఐదంస్తుల బిల్డింగ్‌లో రెండతస్తులనే యూజ్ చేసి మిగతా మూడంస్తులను ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారని సీరియస్ అయింది. ప్రెగ్నెంట్స్ తో వచ్చే అటెండెంట్స్ కోసం నిర్మించిన నైట్ షెల్టర్లకు ఎందుకు తాళం వేశారని, అటెండెంట్స్ వెయిటింగ్ హాల్లోనే ఉండాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నల వర్షం కురిపించింది. కోఠి హాస్పిటల్‌లో సౌకర్యాల లేమిపై 2016లో పలు పేపర్లలో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటో పిల్‌గా తీసుకుని విచారణ జరుపుతుండగా.. గురువారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్‌షావిలి డివిజన్ బెంచ్ విచారణ చేసింది. ప్రభుత్వ చర్యలపై రిపోర్టు ఇచ్చేందుకు టైం కావాలని ప్రభుత్వ లాయర్ రాధీవ్‌రెడ్డి కోరడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అమికస్ క్యూరీ రెండు రిపోర్టులు ఇచ్చారని, వీటి ప్రకారం కోఠి హాస్పిటల్‌లో సమస్యలు అలాగే ఉన్నాయని.. సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.