ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి.. ఏం ఎల్గవెడ్తున్నరు?

ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి.. ఏం ఎల్గవెడ్తున్నరు?

మేము చీవాట్లు పెడుతుంటే మెచ్చుకున్నట్లు చెప్పుకుంటరా?
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కరోనా టెస్టు లెందుకు పెంచుతలేరు?
కోర్టు ఆదేశాలంటే మీకు లెక్కలేకుండా పోయింది
ఇక అవకాశాలు ఉండవు.. చర్యలే
వాస్తవాలు దాచి తప్పుదోవ పట్టిస్తరా?.. మీకెంత ధైర్యం
ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్
హెల్త్ బులెటిన్లో ఫుల్ డిటేల్స్ ఉండాల్సిందే
సీఎస్ 28న వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశం

50 వేల కరోనా టెస్టులు చేస్తామని ఘనంగా చెప్పుకున్నరు.. కానీ ఎంతవరకు చేశారు? ఐసీఎంఆర్‌‌ గైడ్‌లైన్స్‌ను పట్టించుకోరు.. మా ఆదేశాలు అమలు చేయరు. మేమడిగిన వివరాలు ఇవ్వరు.. ప్రభుత్వ తీరు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుంది. టెస్టుల్లో వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బాగా వెనుకబడింది. ఈ నెల 18న టెస్టుల లెక్కలను పరిశీలిస్తే మిలియన్‌ జనాభాకు ఢిల్లీలో 39 వేలు, ఏపీలో 24 వేలు, తమిళనాడులో 24 వేలు, కర్నాటకలో 14 వేలు, మహారాష్ట్రలో 12 వేల టెస్ట్‌‌లు చేశారు. అదే తెలంగాణలో చేసిన టెస్టు లు 6,389 మాత్రమే.
– హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందా?అని హైకోర్టు నిప్పులు చెరిగింది. కరోనా కట్టడి కోసం జాగ్రత్తలు తీసుకోవాలని తాము ఆర్డర్స్ ఇస్తే పట్టించుకోరా ? అని మండిపడింది. ‘‘పోనీ, ప్రభుత్వం సొంతగా ఏమైనా చేస్తుందా అంటే, వెలగబెట్టేదీ ఏమీ కనిపిస్తలేదు. పరిస్థితులు పూర్తిగా చేతులు దాటిపోతుంటే ఆఫీసర్లు మొద్దు నిద్రలో జోగుతున్నారు. పిల్స్‌‌ విచారణకు వచ్చినప్పుడల్లా కోర్టు మొట్టికాయలు వేస్తుంటే.. అభినందించిందంటూ రాష్ట్ర సర్కార్‌‌ నిస్సిగ్గుగా హెల్త్‌‌ బులెటిన్‌‌లో డప్పుకొట్టి చెప్పుకుంటోంది. మా ఆర్డర్స్ అమలు చేయకపోగా కొనియాడినట్లుగా ప్రచారం చేసుకోడానికి మీకెంత ధైర్యం?” అని హైకోర్టు నిలదీసింది. కోర్టు ఆర్డర్స్ అంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆర్డర్స్ ను అమలు చేయకపోతే ఉన్నతాధికారులపై కోర్టుధిక్కార చర్యలు తీవ్రంగా ఉంటాయని, మరోసారి చాన్స్ ఇచ్చేది ఉండదని హెచ్చరించింది. ఇదే చిట్టచివరి అవకాశమని, ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కొని ప్రజారోగ్యాన్ని పట్టించుకోవాలని ఆదేశించింది. కరోనా వైద్యసేవలు, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ పై దాఖలైన పది పిల్స్ ను సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి. విజయ్‌‌సేన్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌ బెంచ్‌ మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లోని వివరాలు పరిశీలించి తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఐదు
గంటలపాటు విచారణ కొనసాగింది.

సీఎస్ వచ్చి సమాధానం చెప్పాలి
‘‘అధికారుల నిరక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వంపై మేం ఎందుకు ఉపేక్షించాలి. నిద్రపోయే ఉన్నతాధికారులపై ఎందుకు వేటు వేయడం లేదు. ఇలాగే ఉంటే మేమే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది” అని హైకోర్టు హెచ్చరించింది. పబ్లిక్‌ హెల్త్‌డైరెక్టర్, మెడికల్‌ ‌ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లను ఆ పదవుల నుంచి తప్పించాలని, ఇదే వారికి లాస్ట్ చాన్స్ అని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల్ని ఎందుకు అమలు చేయడం లేదో వివరించేందుకు చీఫ్‌ సెక్రటరీ సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్స్ స్వయంగా ఈ నెల 28న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

బులిటెన్లో ఫుల్ డిటేల్స్ ఉండాలి
హెల్త్‌ బులిటెన్లను రొటీన్‌గా విడుదల చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘జిల్లాల వారీగా కలెక్టర్లు కరోనా టెస్ట్‌‌లు, పాజిటివ్‌ కేసులు, పేషెంట్ల వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలి. ఒక వేళ జిల్లాల్లో ఒక్క కేసు లేకపోతే జీరో అని కూడా చెప్పాలి. ఇలా అందుకున్న వివరాల్ని ప్రభుత్వం డైలీ హెల్త్‌ బులెటిన్‌ ద్వారా వెల్లడించాలి. కేసు నమోదు కాకపోతే అదే విషయాన్ని రిపోర్టులో పేర్కొనాలి. రోజువారీ వివరాలతోపాటు అప్పటి వరకూ ఉన్నఅన్ని వివరాలనూ వెల్లడించాలి. ఆ వివరాలు వెబ్‌సైట్‌‌లోనూ పొందుపర్చాలి. కంప్లయింట్ల కోసం వాట్సప్‌ నెంబర్‌ ఏర్పాటు చేయాలి. దీని గురించి బాగా ప్రచారం చేయాలి” అని ఆదేశించింది. పెండ్లికి 50 మంది, అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ హాజరైతే చర్యలు తీసుకోవాలని, కరోనా రూల్స్‌ బ్రేక్ చేస్తే కఠినంగా వ్యవహరించాలని స్పష్టంచేసింది. రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేయాలని కేంద్ర బృందం తన పర్యటన తర్వాత సూచించిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పలు సూచనలతో రాష్ట్రానికి ఈ నెల 1న కేంద్రం లెటర్ రాసిందని కేంద్రం తరఫు లాయర్ చెప్తున్నారు. కానీ.. ఆ లెటర్ 19 రోజులైనా ఇంకా అందలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది” అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

టెస్టు లెందుకు పెంచుతలేరు?
కోర్టు ప్రశంసించిందంటూ ఈ నెల 14న హెల్త్‌ బులెటిన్‌లో ఎట్ల చెప్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ‘‘హైకోర్టు కొనియాడిందని ప్రెస్‌మీట్లు పెట్టి ఎట్ల చెప్తరు? నలుగురు లాయర్లు, నలుగురు కానిస్టేబుళ్లు కూడా కరోనాకు బలయ్యారు. జనం అల్లాడుతున్నారు. అయినా టెస్ట్‌‌ల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవడం లేదు. పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. పలు ఆఫీసులు, కోర్టులు తిరిగి పూర్తి స్థాయిలో తెరుచుకునే వాతావరణాన్ని కల్పించే దిశగా చర్యలు ఏవి? ’’ అని ప్రశ్నించింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌‌ కిట్లు రెండు లక్షలు ఉన్నాయని ప్రకటిస్తే సరిపోదని, వాటిని వాడకంలోకి తేవాలని, అవి ఎక్కడ ఉన్నాయో జనానికి తెలిసేలా ప్రచారం చేయాలని ఆదేశించింది. ‘‘50 వేల టెస్ట్‌‌లు చేస్తామని చెప్పి మధ్యలో రెండు రోజులు టెస్టులు చేయలేదు. ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ అమలు చేయడంలో రాష్ట్రం ఘోరంగా ఫెయిలైంది. కంటెయిన్మెంట్ జోన్ల పై సర్కార్‌ వైఖరి అడిగినా చెప్పడం లేదు” అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుందని, 50 వేల టెస్టులు చేస్తామని ఘనంగా చెప్పుకొని దాన్ని ఆచరణలో అమలు చేయలేదని మండిపడింది. ఏపీ, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా టెస్టుల్లో రాష్ట్రం ఎంతో వెనకబడిందని, టెస్టుల లెక్కలే ఆ విషయం తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. ఈ నెల 18న పరీక్షల లెక్కలను పరిశీలిస్తే మిలియన్‌ జనాభాకు ఢిల్లీలో 39 వేలు, ఏపీలో 24 వేలు, తమిళనాడులో 24 వేలు, కర్నాటకలో 14 వేలు, మహారాష్ట్రలో 12 వేల టెస్ట్‌‌లు చేశారని, అదే తెలంగాణలో 6,389 పరీక్షలే చేశారని గుర్తుచేసింది.

వాస్తవాలు దాచి మమ్మల్నే తప్పుదోవ పట్టిస్తరా?
రోజువారీ బులిటెన్‌‌లో టెస్ట్‌‌లు, బెడ్స్‌‌ వంటి వివరాల్లో వాస్తవాలను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని హైకోర్టు ఫైర్ అయింది. పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా తమ ఆర్డర్స్ ను అమలు చేసిన దాఖలాలు లేవని మండిపడింది. ‘‘పూర్తి వివరాలతో హెల్త్‌‌ బులెటిన్‌‌ ప్రకటించడంలో ఇప్పటి వరకూ ప్రభుత్వం ఫెయిలైంది. ఉదాహరణకు ఈ నెల 14 నాటి హెల్త్‌‌ బులిటెన్‌‌లో 11,900 బెడ్స్, 2,816 ఆక్సిజెన్‌‌ బెడ్స్, 1,266 వెంటిలేటర్స్‌‌ ఉన్నాయని, గాంధీలో 900 బెడ్స్‌‌ ఉన్నాయని చెప్పారు. ఆస్పత్రుల వారీగా వివరాలు మాత్రం చెప్ప లేదు. హెల్త్‌‌ బులిటెన్‌‌ కాపీలను జీహెచ్‌ఎంసీ వార్డుల వారీగా ప్రకటించి ఆయా వార్డు కమిటీలకు ఇవ్వాలని గత నెల 8న ఆదేశిస్తే అమలు చేయలేదు” అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

For More News..

శ్రావణం లగ్గాలకు కరోనా అడ్డం

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ