ఆర్టీసీ సమ్మె కేసులో ఈ నెల 1న జరిగిన వాదనల్లో హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఇచ్చిన అఫిడవిట్లోనే పరస్పర విరుద్ధమైన వాదనలు ఉన్నాయంటూ తప్పుబట్టింది. ఆ రోజు జరిగిన వాదనల కాపీ ఆర్డర్ ను ఆదివారం విడుదల చేసింది కోర్టు.
‘‘అఫిడవిట్లో చాలా విరుద్ధమైన అంశాలున్నాయి. 2016 డిసెంబర్ 8నే తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఆర్టీసీకి నిధులు ఇవ్వలేమంటూ జీహెచ్ఎంసీ తీర్మానం ఇచ్చినట్లు సునీల్ శర్మ చెప్పారు. అదే టైంలో అదే ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ రూ.228.40 కోట్లు విడుదల చేసినట్లు ఆయనే చెప్పారు. జీహెచ్ఎంసీ ఫైనాన్స్ పరిస్థితి బాగా లేకుంటే అదే ఏడాది అన్ని నిధులివ్వడమే ఆశ్చర్యంగా ఉంది. జీహెచ్ఎంసీ యాక్ట్ 112 (30) ప్రకారం వారు ఆర్టీసీకి నిధులివ్వాల్సిన అవసరం లేదని సునీల్ శర్మ చెబుతున్నారు. ఇదే నిజమనుకుంటే అప్పటికే రెండు సార్లు జీహెచ్ఎంసీ నిధులిచ్చింది. దానధర్మాల కోసం జీహెచ్ఎంసీ ఇన్ని భారీ నిధులివ్వాల్సిన అవసరం లేదుగా? అయితే జీహెచ్ఎంసీ యాక్ట్ 112 (30) ప్రకారం ఆర్టీసీ సహా రవాణా సౌకర్యాలు, ప్రజా అవసరాల నిర్వహణ కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా సాయం అందించొచ్చని ఉంది. అంటే నిధుల సాయం అందించడాన్ని పరిశీలించేది, నిర్ణయించేది ప్రభుత్వమేనేని తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని జీహెచ్ఎంసీగానీ, దాని కమిషనర్ గానీ తనకుతాను తీసుకోలేరు. అయితే కోర్టు అక్టోబర్ 29న విచారణ ఆర్డర్ ఇచ్చిన తర్వాత రోజు అంటే అక్టోబర్ 30 తేదీతో జీహెచ్ఎంసీ కమిషనర్ రాసినట్లు విచిత్రమైన లేఖ సమర్పించారు. జీహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి నిధులివ్వాల్సిన బాధ్యత లేదనీ, ఎప్పటికప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టే ఇవ్వగలుగుతామని కమిషనర్ నిర్ణయించినట్లు లెటర్ లో చెప్పారు. కానీ జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఈ నిర్ణయాన్ని కమిషనర్ తీసుకోలేరు’’ అని కోర్టు చెప్పింది.
మళ్లీ వేయండి
సరైన వివరాలతో మరో అఫిడవిట్ వేయాలని సునీల్ శర్మను బెంచ్ ఆదేశించింది. మంత్రికి ఇచ్చిన డేటాతో సరిపోయేలా, జీహెచ్ఎంసీ బాకీల వివరాలు, ఆర్టీసీ నిధుల కోసం జీహెచ్ఎంసీని అడిగిందా? అడగకపోతే ఎందుకు మౌనంగా ఉంది? చెబుతూ అఫిడవిట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. 2013–14 నుంచి 2019 అక్టోబర్ 1 వరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల వివరాలివ్వాలని ఆదేశించింది. 7న కోర్టు విచారణకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఎస్కే జోషి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ హాజరు కావాలని కాపీలో చెప్పింది.