చెరువుల ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ ను నిర్ధారించండి

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలోని అన్ని చెరువుల ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ను నిర్ధారించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గత విచారణలో మూడు నెలల గడువు కోరిన హెచ్‌‌‌‌ఎండీఏ.. మళ్లీ గడువు కోరడాన్ని తప్పుపట్టింది. హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌‌‌‌జోన్ల వ్యవహారంపై తామే పర్యవేక్షణ చేస్తామని ప్రకటించింది. డిసెంబర్‌‌‌‌ 30 నాటికి చెరువుల ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌, బఫర్‌‌‌‌ జోన్లపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. 

హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలోని రామమ్మ కుంటలో ఎన్టీఎల్‌‌‌‌ పరిధిలో నేషనల్‌‌‌‌ ఇన్​స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్ టూరిజం అండ్‌‌‌‌ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్‌‌‌‌ నిర్మాణాలు చేపట్టడంపై దాఖలైన పిల్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ శ్రీనివాసరావుతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ బుధవారం విచారించింది. హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌‌‌‌టీఎల్, బఫర్‌‌‌‌ జోన్లపై సుమోటో పిటిషన్‌‌‌‌గా పరిగణించి విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది. గత జులై 24న వ్యక్తిగతంగా హాజరైన హెచ్‌‌‌‌ఎండీఏ కమిషనర్‌‌‌‌ సర్ఫరాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌.. హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని.. 230 చెరువులకు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌  తుది నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసినట్టు తెలిపారు.

మరో 2,525 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేశామని, అభ్యంతరాల స్వీకరణ తరువాత తుది నోటిఫికేషన్‌‌‌‌ జారీకి 3 నెలల గడువు కావాలని కోరారు. ఇప్పుడు మళ్లీ గడువు కోరడాన్ని హైకోర్టు ప్రశ్నించడంపై ప్రభుత్వ అడ్వొకేట్ జవాబు చెబుతూ.. ప్రస్తుతం 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేశామని, అందులో 530 చెరువులకు తుది నోటిఫికేషన్‌‌‌‌ ఇచ్చినట్టు చెప్పారు. చెరువుల సంఖ్య పెరగడంపై హైకోర్టు ప్రశ్నించగా, అప్పటికి కమిషనర్‌‌‌‌ గుర్తించిన చెరువులని, అవి పెరిగాయని చెప్పారు. విచారణ డిసెంబర్‌‌‌‌ 30కి వాయిదా పడింది.