భూదాన్‌‌ భూములను అమ్ముకతిన్నరు : హైకోర్టు

  • కోర్టు ఉత్తర్వులుండగా ధ్రువీకరణపత్రం ఎట్లిస్తరు

హైదరాబాద్, వెలుగు: పేదల కోసం దాత రామచంద్రారెడ్డి 300 ఎకరాలు ఇస్తే వాటిని అమ్ముకొని తినేశారని, వాటిని రక్షించడంలో అధికారులు ఫెయిల్​అయ్యారని హైకోర్టు పేర్కొన్నది. తెలంగాణలో పలువురు పేదల కోసం భూములను ఇచ్చారని, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వ్యవసాయ భూముల సీలింగ్‌‌ చట్టం అమల్లోకి వచ్చినపుడు 500 ఎకరాలు ఇచ్చేశారని తెలిపింది. భూదానయజ్ఞ భూములకు సంబంధించిన వివాదం ఇదే కోర్టులో పెండింగ్‌‌లో ఉండగా కలెక్టర్‌‌ వారసత్వ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంపై ఆశ్చర్యంపై వ్యక్తం చేసింది. 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నెం.182లో 10.29 ఎకరాలకు ఖాదర్‌‌ ఉన్నీసా బేగంకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాలు చేస్తూ నవాబ్‌‌ ఫరూక్‌‌ అలీఖాన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌ సి.వి.భాస్కర్‌‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో భూములను భూదాన్‌‌ భూములుగా ఆర్డీవో ఆదేశాలివ్వగా, స్పెషల్‌‌ ట్రైబ్యునల్‌‌ సమర్థించిందన్నారు. వాటికి విరుద్ధంగా ట్రైబ్యునల్‌‌కు నేతృత్వం వహించిన అధికారి కలెక్టర్‌‌ (అమోయ్‌‌కుమార్‌‌) హోదాలో ఖాదర్‌‌ఉన్నీసా బేగం ఇచ్చిన దరఖాస్తును ఆమోదించి పట్టాదారు పాస్‌‌బుక్‌‌ జారీ చేశారన్నారు. వాదనలు విన్న కోర్టు.. భూదాన్‌‌ భూములకు సంబంధించి వివాదం పెండింగ్‌‌లో ఉన్నప్పటికీ ఆలోచించకుండా పట్టాపాస్‌‌ బుక్‌‌ జారీ చేశారని, ఈ భూములపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూదాన్‌‌యజ్ఞ బోర్డు, గత కలెక్టర్‌‌ డి.అమోయ్‌‌కుమార్, డీఆర్‌‌ఓ ఆర్‌‌.పి.జ్యోతికి నోటీసులిచ్చింది.