విదేశీ కుక్కల దిగుమతి నిషేధంపై హైకోర్టు స్టే

విదేశీ కుక్కల దిగుమతి నిషేధంపై హైకోర్టు స్టే
  • కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: ప్రమాదకర, క్రూరమైన 25 రకాల విదేశీ జాతి కుక్కల దిగుమతిపై కేంద్రం విధించిన నిషేధంపై హైకోర్టు స్టే ఇచ్చింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 25 రకాల విదేశీ జాతి కుక్కల దిగుమతి, బ్రీడింగ్, పెంపకం, విక్రయాలపై నిషేధం విధిస్తూ కేంద్ర పశుసంవర్ధక శాఖ గత మార్చి 12న సర్క్యులర్‌ జారీ చేసింది. 

దీనిని సవాల్‌ చేస్తూ ఫరీదున్నీసా హుమా, ఈస్తర్‌ చౌదరితోపాటు మరో రెండు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు శుక్రవారం విచారించింది. శాస్త్రీయ ఆధారాలు లేకుండా కేంద్రం నిషేధ ఉత్తర్వులిచ్చిందని, ఇప్పటికే కర్నాటక, మద్రాస్, ఢిల్లీ హైకోర్టులు కేంద్ర సర్క్యులర్‌ అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చాయని పిటిషనర్ల తరఫు లాయర్ వాదించారు. దీంతో కేంద్రం జారీ చేసిన సర్క్యులర్​పై  కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.