- సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: విశ్వభారతి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు ఎం.రత్నారెడ్డి, నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ పి.సత్యబాబులకు సింగిల్ జడ్జి విధించిన 6 నెలల జైలు శిక్షను హైకోర్టు నిలిపివేసింది. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన ఎం.రత్నారెడ్డికి, అక్రమ నిర్మాణాలను పాక్షికంగానే కూల్చిన పి.సత్యబాబులకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో వారు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్ కుమార్‌ల డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. నిర్మాణాలు చేపట్టబోమని రత్నారెడ్డి ఇచ్చిన హామీ తర్వాత.. ఆయన నిర్మాణాలు చేపట్టింది.. లేనిది తేలుస్తామని పేర్కొంది.
ఈ క్రమంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ విభాగాధిపతి అధ్వర్యంలో ఎంక్వైరీ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో రెండెకరాల ప్రైవేట్ భూమిలో రత్నారెడ్డి చేపట్టిన నిర్మాణాలు కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ మిర్చుమల్ చెల్లారాం మంఘ్నాని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. లీజు భూమిలో విశ్వభారతి విద్యా సంస్థల భవన నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏకు రత్నారెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నా, అనుమతులు రాకపోయినా నిర్మాణాలు చేపట్టారు. దీంతో మున్సిపాలిటీ నోటీసులిచ్చి, వాటిని పాక్షికంగా కూల్చివేసింది. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి.. రత్నారెడ్డి, నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ పి.సత్యబాబుకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ, రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది.