ఎల్పీజీ వినియోగదారుల బదిలీ విధానంపై స్టే

ఎల్పీజీ వినియోగదారుల బదిలీ విధానంపై స్టే
  • కొత్త పాలసీ అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • కౌంటర్  వేయాలని ఇంధన కంపెనీలకు ఆదేశం
  • విచారణ ఈనెల 16కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: ఎల్పీజీ గ్యాస్‌  వినియోగదారులను ఒక ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి బదిలీ చేయడం ద్వారా మార్కెట్‌  పునర్నిర్మాణం కోసం  గ్యాస్‌  కంపెనీలు తీసుకువచ్చిన నూతన విధానం అమలుపై హైకోర్టు స్టే విధించింది. ఆయిల్‌ కంపెనీలు ఫిబ్రవరి 21న తీసుకువచ్చిన వినియోగదారుల బదిలీ విధానాన్ని సవాలు చేస్తూ శ్రీనివాస ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు 33 గ్యాస్‌  ఏజన్సీలు హైకోర్టులో పిటిషన్‌  వేశాయి. దీనిపై జస్టిస్‌  ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌  విచారణ చేపట్టారు. ఏజెన్సీల తరపున సీనియర్‌  న్యాయవాది ఎ.సుదర్శన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఏళ్ల తరబడి ఏజెన్సీలు రీఫిల్‌  సిలిండర్లను విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.

పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి, సిబ్బంది నియామకాలు చేపట్టి వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ దశలో కొత్త విధానం తీసుకువస్తే వీరికి నష్టం వాటిల్లుతుందన్నారు. 2018 జనవరి 4న మార్కెట్‌  పునర్నిర్మాణం, వినియోగదారుల బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టగా పంపిణీదారులు పలు హైకోర్టుల్లో పిటిషన్‌  దాఖలు చేశారని గుర్తుచేశారు. బాంబే హైకోర్టు ఈ విధానం ఏకపక్షం, అసమంజమని పేర్కొంటూ కొట్టివేయడంతో అన్ని హైకోర్టులు అదే రకమైన ఉత్తర్వులు జారీ చేశాయని తెలిపారు. 

ఆయిల్‌  కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. ఈ దశలో మళ్లీ వినియోగదారుల బదలాయింపు విధానాన్ని తీసుకువచ్చాయన్నారు. గ్యాస్‌  కంపెనీల తరపున సీనియర్‌  న్యాయవాది బి.మయూర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషన్‌  వేసే అర్హత ఏజెన్సీలకు లేదన్నారు. ఈ విధానం వల్ల  కొత్త పంపిణీదారులకు గిట్టుబాటు అయ్యేలా చూడాలన్నదే లక్ష్యమన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కొత్త విధానం అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆయిల్‌  కంపెనీలకు, గ్యాస్‌  ఏజెన్సీల మధ్య జరిగిన ఒప్పంద పత్రాలను సమర్పించాలని ఏజెన్సీలను ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇండియన్‌  ఆయిల్‌  కార్పొరేషన్‌  లిమిటెడ్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌  లిమిటెడ్, హిందుస్తాన్‌  పెట్రోలియం కార్పొరేషన్‌  లిమిటెడ్‌లకు ఆదేశాలు జారీచేస్తూ విచారణను ఈనెల 16కు వాయిదా వేశారు.