
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో నమోదైన కేసులో దర్యాప్తుకు అనుమతించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. దర్యాప్తును నిలిపివేస్తూ ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయలేమని పేర్కొంది. ఈ నెల 27న పూర్తిస్థాయిలో ఇరుపక్షాల వాదనలు విని తేలుస్తామని చెప్పింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులను కస్టడీకి కోరిన నేపథ్యంలో దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించాలని పోలీసులు మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. దీంతోపాటు కేసును కొట్టివేయాలని, బెయిలు మంజూరు చేయాలని రెండో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు దాఖలు చేసిన రెండు పిటిషన్‌లపై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు.
వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. పూర్తిస్థాయిలో వాదనలు వింటామంటూ ఇరుపక్షాల అంగీకారం మేరకు విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. ఈలోగా రాధాకిషన్ రావు పిటిషన్‌లలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.