నిషేధిత జాబితాలోకి భూదాన్​ భూములు

నిషేధిత జాబితాలోకి భూదాన్​ భూములు
  • చేర్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • ఎలాంటి లావాదేవీలకు అనుమతించొద్దని కామెంట్​
  • 30 మంది ఐఏఎస్, ఐపీఎస్‌, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు
  • లిస్టులో నవీన్​ మిట్టల్​, అమోయ్​ కుమార్​, మహేశ్ భగవత్​, స్వాతి లక్రా, రవిగుప్తా, సోమేశ్​ భార్య​.. 

హైదరాబాద్, వెలుగు: భూదాన్​ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్​ 181, 182, 194. 195లోని భూదాన్​ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తోపాటు సబ్‌రిజిస్ట్రార్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. భూదాన్​ భూముల అక్రమాల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఉన్నతాధికారులపై ఆరోపణలున్న నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని, దీంతో నిషేధిత జాబితాలో చేర్చాలని తాము విచక్షణాధికారంతో ఆదేశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. తదుపరి ఆర్డర్స్​ ఇచ్చే దాకా ఈ ల్యాండ్స్​ను అన్యాక్రాంతం చేయరాదని, వీటిపై ఏ ఒక్క లావాదేవీని జరపడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో పెద్దాఫీసర్లు ఉండటంతో పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్‌ను అనుమతించొద్దని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. 

అన్యాక్రాంతానికి వీల్లేదు

నాగారంలోని భూదాన్ ​భూముల్లో అక్రమాలపై విచారణ జరపాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో  సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు.


పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌ అడ్వకేట్​ రవిచందర్‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఉన్నతాధికారులు ఫోర్జరీ పత్రాలు సృష్టించి, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బినామీ లావాదేవీలతో చట్టవిరుద్ధంగా భూదాన్​ భూములను బదలాయించారన్నారు. అంతేగాకుండా భూదాన్​ చట్ట, తెలంగాణ భూదాన, గ్రామదాన నిబంధనలు-1965కు విరుద్ధంగా పలువురు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లు, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌లు సొంత పేర్లతోపాటు కుటుంబసభ్యుల పేర్లతో కొనుగోలు చేశారని తెలిపారు. సీవీసీకి, సీఎంఓ కార్యాలయంతోపాటు హోంశాఖ ముఖ్యకార్యదర్శికి పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారుల పాత్ర ఉన్నందున  కేంద్రానికి చెందిన డీవోపీటీ, హోంశాఖలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. భూముల బదలాయింపు, అన్యాక్రాంతంపై భూదాన చట్టం ప్రకారం నిషేధం ఉన్నప్పటికీ  ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లను చేర్చి పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లు పొందారని తెలిపారు. అక్రమాలను బయటపెట్టిన పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. వాదనలను విన్న జడ్జి.. ప్రాథమికంగా రికార్డులను పరిశీలిస్తే నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూములు భూదాన బోర్డుకు చెందినవన్నారు. సాగు నిమిత్తం భూములను పేదలకు కేటాయించవచ్చని.. దీంతోపాటు ప్రభుత్వం, స్థానిక సంస్థలు ప్రజలవసరాలకు, బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణానికి వినియోగించుకోవచ్చని తెలిపారు. భూదాన చట్టం ప్రకారం కేటాయింపులు వారసత్వంగా ఇవ్వవచ్చని, అంతేగానీ అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదన్నారు. 

ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలున్నందున కిందిస్థాయి అధికారులను ప్రభావితం చేయడం ద్వారా ప్రయోజనాల రక్షణకు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ కలెక్టర్​తోపాటు మహేశ్వరం, ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌లకు ఆదేశాలు జారీచేశారు. ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలున్నందున పిటిషన్‌‌‌‌‌‌‌‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్‌‌‌‌‌‌‌‌ను అనుమతించబోమని పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూదాన్‌‌‌‌‌‌‌‌ యజ్ఞ బోర్డు, సీసీఎల్‌‌‌‌‌‌‌‌ఏతోపాటు సీబీఐ, ఈడీకి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.   ప్రతివాదులైన ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లు, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌లు, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేయాలని పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు స్పష్టంచేసింది. 

నోటీసులు వీరికే..

దాదాపు 30 మంది ఐఏఎస్​లు, ఐపీఎస్​లు, వారి కుటుంబసభ్యులు, ఉన్నతాధికారులు, ప్రైవేట్​ వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయినవారిలో ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లు నవీన్‌‌‌‌‌‌‌‌ మిట్టల్,  అమోయ్‌‌‌‌‌‌‌‌కుమార్, రాజశ్రీ షా, అజయ్‌‌‌‌‌‌‌‌జైన్, హరీశ్​, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌లు మహేశ్‌‌‌‌‌‌‌‌ భగవత్, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్తా, తరుణ్‌‌‌‌‌‌‌‌ జోషి, తోట శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్‌‌‌‌‌‌‌‌ హెగ్డే, ఏకే మహంతి,  కుటుంబ సభ్యులు జ్ఞాన్​ముద్ర (ఐఏఎస్​ సోమేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ భార్య), తాటిపత్రి పావనీరావు(తాటిపత్రి ప్రభాకర్​రావు ఐపీఎస్ భార్య), ఐశ్వర్యరాజ్​(ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ వికాస్‌‌‌‌‌‌‌‌ రాజ్​ కుమార్తె), వసుంధర సిన్హా(ఐఏఎస్​ అంజనీకుమార్​భార్య) , ఓం.అనిరుధ్‌‌‌‌‌‌‌‌ (రాచకొండ కమిషనర్‌‌‌‌‌‌‌‌ సుధీర్​బాబు కుమారుడు), నందిని మాన్‌‌‌‌‌‌‌‌ (ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ విక్రమ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌మాన్‌‌‌‌‌‌‌‌ భార్య), రీటా సుల్తానియా (ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌ సుల్తానియా భార్య), వెన్నవెల్లి రాధిక (ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ కమలాసన్‌‌‌‌‌‌‌‌రెడ్డి భార్య),    నితేష్‌‌‌‌‌‌‌‌రెడ్డి (మాజీ డీజీపీ మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కుమారుడు), రేఖా షరాఫ్‌‌‌‌‌‌‌‌ (ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ ఉమేశ్‌‌‌‌‌‌‌‌ షరాఫ్‌‌‌‌‌‌‌‌ భార్య), రేణుగోయల్‌‌‌‌‌‌‌‌ (డీజీపీ జితేందర్‌‌‌‌‌‌‌‌ భార్య), దివ్యశ్రీ (ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ ఆంజనేయులు భార్య), హేమలత (ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ డీజీ శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి భార్య), ఇందూ రావు కావేటి (ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనారాయణ కుమారుడు), సవ్యసాచి ప్రతాప్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ (ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ గోవింద్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ కుమారుడు), పేర్ల వరుణ్‌‌‌‌‌‌‌‌ (ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ విశ్వప్రసాద్‌‌‌‌‌‌‌‌ కుమారుడు) తదితరులు ఉన్నారు. తదుపరి విచారణను జూన్‌‌‌‌‌‌‌‌ 12కు హైకోర్టు వాయిదా వేసింది.