- మెదక్ ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ కేసులో హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడిన కార్మికుడిని యాజమాన్యం తొలగించవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. టెక్నికల్‌గా తప్పుచేసిన కార్మికుడిని విధుల్లోకి తీసుకోవాలని కార్మిక ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. తప్పు చేసిన కార్మికుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎంఆర్‌ఎఫ్‌ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సైతం రద్దు చేసింది. మెదక్‌కు చెందిన సంగమేశ్వర్ 1995లో ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్‌లో ఉద్యోగంలో చేరి పర్మినెంట్ అయ్యారు. 2008లో సూపర్‌వైజర్‌పై చేయి చేసుకోవడంతో అతన్ని ఎంఆర్‌ఎఫ్ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై సంగమేశ్వర్ కార్మిక ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించాడు. అతడిని తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని కంపెనీని ట్రిబ్యూనల్ ఆదేశించింది.
అనంతరం కంపెనీ తనకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలంటూ సంగమేశ్వర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి తీర్పు వెలువరిస్తూ.. కార్మికుడు సంగమేశ్వర్‌ను విధుల్లోకి తీసుకోవాలని..పనిచేయని కాలానికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదంది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ మళ్లీ ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్ అప్పీలు దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టిలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
వాదనల అనంతరం ఎంఆర్‌ఎఫ్ నిర్ణయం సమర్థనీయమేనంటూ తీర్పు వెలువరించింది. సూపర్‌వైజర్‌పై దాడి కరెక్ట్ కాదని తెలిపింది. ఘటనపై విచారణ అనంతరం సమర్పించిన నివేదిక ఆధారంగానే ఉద్యోగం నుంచి తొలగించినట్లు వివరించింది. సూపపర్‌వైజర్‌ను కొట్టడమనే ఘటనను తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణించాల్సిందేనని, చెప్పిన పని చేయకపోవడం అవిధేయత, క్రమశిక్షణారాహిత్యమేనని కోర్టు పేర్కొంది. క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడిన కార్మికుడిపై చర్య తీసుకోకుంటే మిగిలిన కార్మికులు కూడా అలాగే తయారయ్యే అకాశం ఉందని అభిప్రాయపడింది. ఇలా సమస్యలు సృష్టించే వ్యక్తిని తిరిగి విధుల్లోకి తీసుకుంటే అక్కడ వాతావరణం దెబ్బతింటుందని తెలిపింది. అందువల్ల కార్మికుడిని తిరిగి తీసుకోవాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని కోర్టు పేర్కొంది.