ఐఏఎస్​ అమోయ్‌‌ కుమార్‌‌ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు

ఐఏఎస్​ అమోయ్‌‌ కుమార్‌‌ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు
  • గుట్టలబేగంపేట భూముల కేసులో హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని సర్వే నంబర్.63లో ప్రభుత్వానికి చెందిన 78 ఎకరాల్లో 52 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ అప్పటి కలెక్టర్‌‌ అమోయ్‌‌ కుమార్‌‌ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ భూములపై కలెక్టర్‌‌ ఇచ్చిన ఉత్తర్వులు సరికావని తప్పుబట్టింది. కోర్టు వివాదాలు నడుస్తుండగా నిషేధిత జాబితా నుంచి తొలగించడం చెల్లదని, ఆ భూముల్లో జోక్యం చేసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది.

గుట్టలబేగంపేటలోని 78 ఎకరాల భూమి హక్కులపై సుదీర్ఘకాలంగా కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. 2018లో ఈ భూమి ప్రభుత్వానిదేనంటూ బోర్డులు ఏర్పాటు చేయడంతో.. తమ భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో యథాతథస్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నిషేధిత జాబితాలో ఉన్న 78 ఎకరాల్లో 52 ఎకరాలను తొలగిస్తూ 2022 ఆగస్టు 8న అప్పటి కలెక్టర్‌‌ అమోయ్‌‌ కుమార్‌‌ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఈ భూమిలో ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకోవాలని, నిషేధిత జాబితాలో నుంచి 52 ఎకరాలను తొలగించడం ద్వారా రిజిస్ట్రేషన్‌‌కు అవకాశం కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ విచారణ చేపట్టారు. సుదీర్ఘ వాదనలను విన్న జడ్జి.. కలెక్టర్‌‌ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, ఆ భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ తీర్పు చెప్పారు.