మిర్యాలగూడ, వెలుగు : భూమి పంచాయితీ విషయమై హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించిన ప్రస్తుత నల్గొండ జిల్లా వేములపల్లి మండల ఎస్ఐ దాచేపల్లి విజయ్ కుమార్ కు మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ ఈనెల 1న హైకోర్టు తీర్పు వెలువరించింది. పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలోని సర్వే నంబర్ 902లో 2. 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే, ఈ వ్యవసాయ భూమి విషయంలో 2021లో అప్పటి కట్టంగూరు ఎస్ఐగా ఉన్న విజయ్ కుమార్, శాలీగౌరారం సీఐ రాఘవరావు జోక్యం చేసుకున్నారు. ఆ భూమిపై తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించిన అధికార పార్టీ మాజీ సర్పంచ్ నాగులపాటి నాగమణికి సహకరించి హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు.
ఇదే విషయమై పలుమార్లు సదరు ఎస్ఐకి, సీఐకి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఉద్దేశపూర్వకంగా ఆ ఇద్దరూ కోర్టు ఉత్తర్వులను ఉల్లఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎస్ఐకి మూడు నెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. సీఐకి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.