- ఆయనకు ఎలాంటి టైమ్‌బాండ్ పెట్టలేం
- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు
- 10వ షెడ్యూల్ కింద ‘డిస్ క్వాలిఫై’ని తేల్చే అధికారం స్పీకర్‌దే
- తగిన సమయంలో ఆయనే నిర్ణయం ప్రకటించాలి
- తగిన సమయం అనేది కేసులోని అంశాలపై ఆధారపడి ఉంటది
- గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులూ ఇదే విషయాన్ని చెప్తున్నయ్
- స్పష్టం చేసిన హైకోర్ట్ డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి తీర్పు రద్దు
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చాల్సింది అసెంబ్లీ స్పీకరేనని.. ఫలానా టైమ్‌లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు తాము డెడ్‌లైన్ పెట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎప్పటిలోగా తన నిర్ణయం వెలువరించాలన్నది కూడా స్పీకర్ పరిధిలోని అంశమేనని పేర్కొంది. ‘‘రాజ్యాంగమే సుప్రీం.
రాజ్యాంగ అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్‌కే అనర్హత పిటిషన్ల విషయంలో నిర్ణయాధికారం ఉంటుంది” అని తెలిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలంటూ, వాటి ఆధారంగా 4 వారాల్లో విచారణకు షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును శుక్రవారం హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
ఈ మేరకు 78 పేజీల తీర్పును వెలువరించింది. 10వ షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లపై తగిన(సహేతుక) సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. ‘‘తగిన సమయం అనేది ఆ కేసులోని అంశాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. తగిన సమయాన్ని నిర్ణయించే ముందు ఇప్పటికే అనర్హత పిటిషన్లు పెండింగ్ ఉన్న టైమ్‌ను, ఎమ్మెల్యేల 5 ఏండ్ల పదవీ కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పేర్కొంది.
‘‘10వ షెడ్యూల్ లక్ష్యం, ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆ షెడ్యూల్ కింద స్పీకర్‌కే నిర్ణయాధికారం ఉంది. నిర్ణయం తీసుకునే అంశంలో స్పీకర్‌కు టైమ్ బాండ్ విధించే అధికారం కోర్టులకు లేదు” అని హైకోర్టు డివిజన్ బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది.
సుదీర్ఘ విచారణ అనంతరం
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియంశ్రీహరి, వెంకట్రావు, దానం కాంగ్రెస్‌లో చేరడంతో వారిపై అనర్హత వేటువేయా లని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు.
విచారించిన సింగిల్ జడ్జి 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సెప్టెంబర్ 9న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖ లు చేశారు. వీటిపై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి ఈ నెల 12న తీర్పు రిజర్వు చేసి శుక్రవారం వెలువరించింది.
ఇరుపక్షాల వాదనలు
హైకోర్టులో విచారణ సందర్భంగా ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. ‘‘స్పీకర్ తన ముందున్న పిటిషన్లపై నిర్ణయం వెలువరించిన తర్వాత కోర్టులు న్యాయ సమీక్ష జరపొచ్చు. కానీ, స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందు కోర్టులు ఆయనపై ఒత్తిడి తేలేవు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజ్యాంగ అధిపతి అయిన స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అతి స్వల్పం.
అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, ట్రిబ్యునల్ చైర్మన్‌గా.. ఇలా స్పీకర్ పలు కీలక విధులు నిర్వహిస్తారు. తన ముందున్న అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. ఆ స్వేచ్ఛను స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించింది’’ అని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్లు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, జంద్యాల రవిశంకర్ వాదించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్ గండ్ర మోహన్‌రావు, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫున అడ్వకేట్ జె.ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. ‘‘పదో షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ తన ముందున్న అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి.
శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుల అంశంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదు’’ అని పేర్కొన్నారు. వీటన్నిటిని విని విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని, తగిన సమయంలో ఆయనే తేలుస్తారంటూ శుక్రవారం తీర్పును వెలువరించింది.
సుప్రీం తీర్పులను పరిగణనలోకి తీసుకొని..!
అనర్హత పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను హైకోర్టు ప్రస్తావించింది. కిహొటో హోలోహాన్, రాజేంద్రసింగ్‌రాణా, కేశం మెగాచంద్రసింగ్ కేసులతోపాటు తాజాగా సుభాష్ దేశాయ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ తీర్పులన్నింటినీ పరిశీలిస్తే 10వ షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లపై తేల్చే అధికారం స్పీకర్‌కు ఉందనే విషయం స్పష్టమవుతున్నదని తెలిపింది.
రాజ్యాంగ అత్యున్నత పదవిలో స్పీకర్ ఉంటారని, పదో షెడ్యూలు ప్రకారం స్పీకర్ తన అధికారాలను వినియోగించాల్సి ఉంటుందని వివరించింది. అనర్హత పిటిషన్లు దాఖలు చేసి నాలుగున్నర నెలలు గడిచిపోయిందని, తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.