దళితబంధుపై హైకోర్టు కీలక తీర్పు

దళితబంధుపై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్:  దళితబంధు నిలిపివేయడంపై దాఖలైన 4 పిటిషన్లు కొట్టేసింది హైకోర్టు. మల్లేపల్లి లక్ష్మయ్యతో పాటు మరో ముగ్గురు వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. నోటిఫికేషన్ వచ్చాక ఈసీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పింది కోర్టు. ఎన్నికల సంఘం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. హుజురాబాద్‌ ఉప ఎన్నిక క్రమంలో అక్కడ దళితబంధును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్‌ నేత జడ్సన్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అలాగే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్స్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కలిపి విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. గురువారం నాలుగు పిటిషన్లను కొట్టివేస్తూ  తీర్పునిచ్చింది. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది.