కరోనా టెన్షన్తో ఇన్సూరెన్స్ లకు ఎగబడుతున్న జనం
ముందుగా జాగ్రత్త పడితే మేలని ఎక్కువ మంది భావన
ప్రత్యేకంగా కరోనా ప్యాకేజీలు విడుదల చేసిన కంపెనీలు
హైదరాబాద్, వెలుగు: మల్కాజ్‌గిరిలో ఉండే 46 ఏండ్ల దయాకర్‌కు కరోనా పాజిటివ్ వచ్చి ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చేరాడు. షుగర్ పేషెంట్ కావడంతో వారం పాటు ట్రీట్‌మెంట్ తీసుకుంటే తప్ప పరిస్థితి మెరుగుపడలేదు. ఐదు రోజులకు ఆయనకు అయిన బిల్లు రూ.7 లక్షలు. రూ.15 లక్షల హెల్త్ పాలసీ ఉండడంతో రూ.లక్ష వరకు చేతిలో నుంచి చెల్లించి బయట పడ్డారు. ఏడు నెలల క్రితం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేముందు తనకు అవసరమా అని ఆయన భావించాడు. కానీ అదే కరోనా టైమ్‌లో బాగా పనికొచ్చింది. విషయం తెలుసుకున్న ఆయన ఫ్రెండ్స్ అర్జంట్‌గా పాలసీ తీసుకోవడం బెటర్ అని భావించి ఏజెంట్ల దగ్గరికి పోయారు. ఎవరి పరిస్థితులకు అనుకూలంగా వాళ్లు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకుపాలసీలు తీసుకున్నారు.
టెన్షన్ పెడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్
కరోనా పేషెంట్లకు ప్రైవేటు హాస్పిటళ్లలో వేస్తున్న బిల్లులు చాలా మందిని టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. వైరస్ తమకెక్కడ వస్తుందోననే ఆందోళన చాలా మందిలో ఉంది. ఆక్సిజన్, వెంటిలేటర్ మీద ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి లక్షల్లో బిల్లు వేస్తున్నారు. చేతిలో రూ.లక్షలు లేనిదే హాస్పిటళ్లు కరోనా పేషెంట్లను చేర్చుకునే పరిస్థితి లేదు. దీంతో ఎందుకైనా మంచిదనే చాలా మంది హెల్త్ పాలసీలు తీసుకుంటున్నారు.
అన్ని ఏజ్‌ల వాళ్లు తీసుకుంటున్నరు..
ఇన్‌కం ట్యాక్స్ నుంచి సేవ్ అయ్యేందుకు చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. కొందరు యాక్సిడెంట్ లాంటి రిస్క్ పాలసీలు తీసుకుంటారు. ‘‘ముఖ్యంగా యంగ్‌ఏజ్‌లో ఉన్న వాళ్లు హెల్త్‌పాలసీల పట్ల ఆసక్తి చూపించరు. 40–45 ఏజ్‌లో కొందరికి ఆ ఆలోచన వస్తుంది. 50–60 ఏండ్ల వయసులోనే ఎక్కువ మంది హెల్త్ పాలసీల గురించి ఎంక్వయిరీ చేస్తారు. యంగ్ ఏజ్‌లో కొందరు పిల్లలకోసమో, పేరెంట్స్‌కోసమో పాలసీలు తీసుకున్నా క్లెయిమ్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది . చాలా మంది రూ. ఐదు లక్షలు దాటరు. కరోనా కారణంగా రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల ప్యాకేజీల వరకూ ఎంక్వయిరీ చేస్తున్న వాళ్లే ఇప్పుడు ఎక్కువ’’ అని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోలో పనిచేస్తున్న ధీరజ్ తెలిపారు.
కరోనాకు స్పెషల్ ప్యాకేజీలు..
కరోనా కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు రూపొందించమని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఐఏ) ఇటీవలే హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. దీనికి జూన్ 10ని డెడ్‌లైన్‌గా ప్రకటించింది. దీంతో కంపెనీలన్నీ కొత్త ప్యాకేజీలతో ముందుకొచ్చాయి.33 కోట్ల కస్టమర్ బేస్ ఉన్న ఎల్‌ఐసీకూడా కరోనా ప్యాకేజీ విడుదల చేసే ప్లాన్‌లో ఉందని ఆ సంస్థ ఏజెంట్ శివ తెలిపారు. ఈ రంగంలో ఉన్న వివిధ కంపెనీలు రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు ప్యాకేజీ ఉన్న పాలసీలను విడుదల చేశాయి. యునైటెడ్ హెల్త్‌ఇన్సూరెన్స్ రూ.లక్ష నుంచి రూ.10 లక్షల ప్యాకేజీ, ఎస్‌బీఐ హెల్త్‌ఇన్సూరెన్స్ రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల ప్యాకేజీ, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షల ప్యాకేజీలు అనౌన్స్ చేశాయి. మ్యాక్స్‌బూపా,ఎడెల్‌వైజ్, లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.కోటి వరకు పాలసీలను ప్రకటించాయి.
వైరస్ భయంతోనే పాలసీలు..
సాధారణంగా ఈ సీజన్‌లో మేం మూడు, నాలుగు లక్షల రూపాయల బిజినెస్ చేస్తాం. ఇపుడు మేం 20 నుంచి 25 లక్షల వరకు బిజినెస్ చేస్తున్నాం. కారణం కరోనా టెన్షనే. వైరస్‌కు భయపడి చాలా మంది హెల్త్ పాలసీలు తీసుకుంటున్నారు. గతంలో పాలసీ లేని వాళ్లే ఎక్కువగా వస్తున్నారు. కొందరు పాత పాలసీ క్లెయిమ్ ఎమౌంట్ పెంచుకుంటూ ప్రత్యేకంగా వచ్చిన ప్లాన్‌లో చేరుతున్నారు.
– స్టార్ హెల్త్ సేల్స్ మేనేజర్ బి.వెంకటేశ్
For More News..