కరోనాపై పోరులో తెలుగు రాష్ట్రాల మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్!

ఏపీ-తెలంగాణకు జమీన్ ఆస్మాన్ ఫరక్!
పది లక్షల టెస్టులు చేసిన పొరుగు రాష్ట్ర సర్కార్..
మన దగ్గర లక్షా పదివేలే

హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ కాంటాక్ట్ అని తేలితే చాలు.. ఎంతమందికైనా టెస్టులు చేస్తోంది ఏపీ సర్కార్. పది లక్షలదాకా టెస్టులు చేసింది. వాళ్లకు ట్రీట్ మెంట్ చేయించి తగ్గాక ఇళ్లలో దిగబెడుతోంది. కానీ, మన రాష్ట్రంలో ‘మేం ప్రైమరీ కాంటాక్ట్ లం.. టెస్టులు చేయండి’ అని జనం ఆస్పత్రులకు వెళుతున్నా.. ‘లక్షణాల్లేవ్.. వెళ్లిపోండి’ అంటోంది సర్కార్ . పాజిటివ్ వచ్చిన వాళ్లనూ డిశ్చార్జ్ చేసేస్తోంది. కనీసం ఇళ్లకు పోవడానికి అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేయదు. వాళ్లే బయటకు వచ్చేసి ఆటోలు, క్యాబులు మాట్లాడుకుని ఇంటికి వెళ్లేంత దారుణ పరిస్థితి. ఐసీఎంఆర్ పెట్టిన ట్రిపుల్ టీ ఫార్ములా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్లో ఏపీ రోల్మోడల్ గా నిలుస్తుంటే.. మన రాష్ట్రం చేతులెత్తేసింది.

ఏపీలో నెగెటివ్ వస్తే వెంటనే మెసేజ్
ఏపీలో కరోనా టెస్టుల కోసం వచ్చే వారి ఆధార్, ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు అధికారులు. ఎవరికైనా పాజిటివ్ వస్తే వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు అధికారులు సదరు పాజిటివ్ పేషెంట్ ఇంటికి వెళ్లి అతడిని హాస్పిటల్ కు తరలిస్తున్నారు. అతడి నివాస ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్ గా మారుస్తున్నారు. నెగెటివ్ వచ్చిన వారికి ‘రిజల్ట్ నెగెటివ్’ అంటూ ఫోన్ కు మెసేజ్ పంపిస్తున్నారు.

ఇక్కడ నెగెటివ్ వస్తే చెప్పట్లే..
కరోనా క్లోజ్, ప్రైమరీ కాంటాక్ట్లకు టెస్టులు చేసినా ఆ రిజల్ట్ ఏంటన్నది నెగెటివ్ వచ్చిన వారికి సర్కారు చెప్పట్లేదు. పాజిటివ్ వచ్చిన వారికి హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లు ఫోన్ చేసి అలర్ట్ చేస్తున్నారు. దగ్గర్లోని గవర్నమెంట్ హాస్పిటల్ కు రావాలని సూచిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారు తమకు తాముగానే హాస్పిటల్ కు వెళ్తున్నారు. అక్కడి నుంచి వారిని గాంధీకో, మరో హాస్పిటల్ కో షిఫ్ట్ చేస్తున్నారు.

అక్కడ అనుమానం ఉన్నోళ్లందరికీ టెస్టులు
కరోనా ప్రైమరీ కాంటాక్టులకే కాదు.. అనుమానం వచ్చి ఆస్పత్రి గడప తొక్కిన ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయిస్తోంది ఏపీ సర్కార్. అలాంటి వాళ్లనుంచి వీలైతే హాస్పిటల్లో లేదా.. వాళ్లుండే చోటుకే వెళ్లి శాంపిల్స్ సేకరిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అంతేకాదు.. ఈమధ్యే ఇంటింటికీ టెస్టులు చేయిస్తామనీ ఏపీ ప్రకటించింది. ఎక్కడైనా ఒక పాజిటివ్ కేసు వస్తే ఆ పేషెంట్తో కాంటాక్ట్ అయిన వారందరికీ పరీక్షలు చేస్తున్నారు. కాంటాక్ట్లను ట్రేస్ చేసి ట్రూనాట్ టెస్టులు చేయిస్తున్నారు. రిజల్ట్ వచ్చే వరకు వాళ్లందరినీ హోంక్వారంటైన్లో ఉంచుతున్నారు. పాజిటివ్ అని తేలితే వెంటనే అంబులెన్సులో జిల్లా హెడ్ క్వార్టర్స్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఎవరికైనా లక్షణాలు సీరియస్ గా ఉంటే అలాంటి వాళ్లకు పీపీఈ కిట్లు ఇచ్చి పెద్దాస్పత్రికి పంపిస్తున్నారు. వెంటనే ఆర్టీపీర్టీసీ టెస్టులు చేస్తున్నారు. ఆ టెస్టులో మళ్లీ పాజిటివ్ వస్తే హాస్పిటల్ లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ట్రూనాట్ టెస్టుల్లో పాజిటివ్ గా తేలిన వాళ్లలో 10 శాతం మందికే ఆర్టీపీర్టీసీ టెస్టుల్లో పాజిటివ్ వస్తోందని ఏపీ అధికారులు చెబుతున్నారు. ట్రూనాట్ లో పాజిటివ్ వచ్చి ఆర్టీపీర్టీసీ లో నెగెటివ్ గా తేలిన వారిని మళ్లీ అంబులెన్సుల్లోనే తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళుతున్నారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచనలు ఇస్తున్నారు. ట్రీట్మెంట్ తో కోలుకున్న వారినీ ప్రభుత్వమే ఇంటి దగ్గర దిగబెట్టి.. 14 రోజుల హోంక్వారంటైన్ ను తప్పనిసరి చేస్తోంది.

మన దగ్గర హాస్పిటల్ కు వెళ్లినా చెయ్యరు
మన రాష్ట్రంలో అనుమానమొచ్చి హాస్పిటల్ కు వెళ్లినా టెస్టులు చేయని పరిస్థితి ఉంది. పాజిటివ్ వచ్చిన వారి క్లోజ్ కాంటాక్ట్స్ కు, కుటుంబ సభ్యులకూ టెస్టులు గగనమే. ఏమైనా అంటే ఐసీఎంఆర్ పేరు చెప్పి టెస్టులను తప్పించుకుంటోంది ప్రభుత్వం. లక్షణాల్లేని వాళ్లకు టెస్టులు అవసరమేలేదని ఆస్పత్రి వాళ్లు వెనక్కు పంపిస్తున్నారు. ప్రభుత్వం టెస్టులు చేయకపోవడంతో కాంటాక్ట్ లంతా ప్రైవేట్ ల్యాబులకు క్యూ కడుతున్నారు. అయితే, ప్రైవేటు ల్యాబులు తప్పుడు టెస్టులు చేస్తున్నాయంటూ సర్కారు టెస్టులు ఆపివేయించింది. ఎక్కువ టెస్టులు చేయాలని హైకోర్టు ఆదేశించినా టెస్టుల సంఖ్యను పెంచడం లేదు. రాష్ట్రంలో టెస్టింగ్ కెపాసిటీ కేవలం 6,500.

ఏపీలో 9.96 లక్షల టెస్టులు
కరోనా టెస్టుల విషయంలో ఏపీ ముందు నుంచీ ముందు వరుసలోనే ఉంటోంది. వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేస్తూ కరోనా నియంత్రణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటిదాకా మొత్తం 9 లక్షల 96 వేల 573 టెస్టులు చేసింది ఏపీ సర్కార్. అన్ని టెస్టులు చేస్తే 17,699 మందికి పాజిటివ్ వచ్చింది. 218 మంది చనిపోయారు. శనివారం 24,962 టెస్టులు చేస్తే 727 మందికి పాజిటివ్ వచ్చింది. శుక్రవారం రికార్డ్ స్థాయిలో 38,898 టెస్టులు చేసింది ఏపీ. అంతకుముందు ఒక్కరోజులో చేసిన 36,047 టెస్టుల రికార్డును దాటింది. అక్కడ పాజిటివ్ రేటు 1.77 శాతం కాగా, రికవరీ రేటు 45.24 శాతం, మరణాల రేటు 1.23 శాతంగా ఉంది.

మన దగ్గర లక్షా పదివేలే
టెస్టులకు సంబంధించి మన రాష్ట్రం ముందు నుంచీ నిరక్ష్ల్యంగానే ఉంటోంది. తక్కువ టెస్టులు చేస్తోంది. హైకోర్టు చెప్పినా పట్టించుకోలేదు. అయితే, టెస్టులు చేయాలంటూ ఒత్తిళ్లు పెరుగుతుండడంతో ఈ మధ్యే కాస్త వేగం పెంచింది. అయినా కూడా ఏపీకి ఆమడ దూరంలోనే ఉంది. ఇప్పటిదాకా రాష్ట్రంలో చేసింది లక్షా 10 వేల 545 టెస్టులే. అందులో 22,312 మందికి పాజిటివ్ వచ్చింది. 288 మంది చనిపోయారు. అంటే రాష్ట్రంలో పాజిటివ్ రేటు 20.18%, డెత్రేటు 1.29%. శనివారం రాష్ట్రంలో చేసిన టెస్టులు 6,427.. అందులో 1,850 మందికి పాజిటివ్ గా తేలింది. అంటే పాజిటివ్ రేటు 28.78%. ఇప్పటిదాకా ఒక్కరోజు చేసిన టెస్టుల్లో ఇదే హయ్యెస్ట్. ఏపీ మూడు రోజుల్లో చేసిన టెస్టులను.. మన దగ్గర నాలుగు నెలల్లో చేశారు.

ఏపీలో కంటెయిన్మెంట్ స్ట్రిక్ట్
ఏపీలో ఎక్క డైనా ఒక కరోనా కేసు వస్తే వైరస్ సోకిన వ్యక్తి ఇంటికి రెండు వైపులా వంద మీటర్ల చొప్పున రెడ్ జోన్ గా.. ఇంకో వంద మీటర్ల వరకు బఫర్ జోన్ గా డివైడ్ చేసి కంటెయిన్మెంట్ చేస్తున్నారు. ఆ ఏరియాలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడి వారికి అవసరమైన అన్ని సరుకులు, వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. అంతేకాదు.. వేరే ప్రాంతాల నుంచి వచ్చేటోళ్లకు బార్డర్ లో థర్మల్ స్క్రీనింగ్ చేయకుండా లోపలికి అనుమతించట్లేదు. వచ్చిన వాళ్లు కచ్చితంగా హోంక్వారంటైన్ అయ్యేలా రూల్స్ పెట్టింది. ఎవరికైనా లక్షణాలున్నట్టు తేలితే వెంటనే పలు చోట్ల ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉంచి కరోనా టెస్టులు చేస్తున్నారు.

మనదగ్గర పక్కింట్లోనే పేషెంట్లు
దేశానికే కంటెయిన్మెంట్ అనే పదాన్ని పరిచయం చేసినట్టుగా చెప్పుకుంటోంది మన రాష్ట్ర సర్కారు. కానీ, ఇప్పుడు కంటెయిన్మెంట్ జోన్లు ఎక్కడున్నాయంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకే తెలియని పరిస్థితి. ప్రస్తుతం 6,556 మంది కరోనా పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. వాళ్లలో చాలా మంది తమకు కరోనా వచ్చిందన్న విషయం పక్కింటి వాళ్లకూ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాంటి ఏరియాలను సర్కారు కనీసం కంటెయిన్మెంట్ చేయట్లేదు. ఫలితంగా కరోనా పేషెంట్లు పక్కనే ఉంటున్నా చాలా మందికి తెలియని పరిస్థితి. చెక్ పోస్టుల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వారికి బార్డర్లలోని చెక్ పోస్టుల్లో కనీసం థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయట్లేదు.

ఏపీ, తెలంగాణల మధ్య తేడాలు ఇలా ఉన్నాయి..

ఆంధ్రప్రదేశ్
టెస్టులు 10 లక్షలు
కేసులు 17,699
శుక్రవారం 38,898 టెస్టులతో రికార్డ్
అనుమానితులందరి శాంపిళ్ల సేకరణ
హోమ్ ఐసోలేషన్ పేషెంట్ల మానిటరింగ్
పర్మిషన్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి
కోలుకున్నోళ్లు అంబులెన్సుల్లో ఇంటికి..

తెలంగాణ
టెస్టులు లక్షా10వేలు
కేసులు 22,312
ఇప్పటిదాకా ఒక్కరోజులో చేసిన హయ్యెస్ట్ టెస్టులు 6,427
కరోనా పేషెంట్ క్లోజ్ కాంటాక్ట్స్, ఫ్యామిలీకీ నో టెస్టులు
హోమ్ ఐసోలేషన్ పేషెంట్లను పట్టించుకోవట్లే
అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్న జనాలు
పాజిటివ్ పేషెంట్లూ డిశ్చార్జ్.. ఆటోలు, క్యాబుల్లో ఇంటికి

For More News..

ప్రైవేటులో టెస్టులతో భారీగా బయటపడుతున్న కరోనా కేసులు

జూలై 7 నుంచి నిమ్స్ లో వ్యాక్సిన్ ట్రయల్స్