ఖానాపూర్ మున్సిపాలిటీలో హైడ్రామా..హైకోర్టు స్టేతో ఆగిన అవిశ్వాసం

  ఖానాపూర్, వెలుగు : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ​చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్ అహ్మద్​పై అవిశ్వాసం పెట్టొద్దంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. మళ్లీ ఫిబ్రవరి 1వ తేదీకి కేసును వాయిదా వేసింది. గురువారం సాయంత్రమే స్టే రాగా ఉత్తర్వులు మాత్రం కలెక్టర్ దగ్గరకు    చేసేసరికి ఆలస్యమైంది. ఖానాపూర్​ మున్సిపాలిటీలో12 మంది  కౌన్సిలర్లుండగా 9 మంది అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసి 10 రోజులుగా క్యాంపులో ఉన్నారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరపనున్నట్టు అధికారులు ప్రకటించడంతో అందరూ ఉదయం10:30 గంటలకే మున్సిపల్ ఆఫీసుకు వచ్చారు. అప్పటికే నిర్మల్ ఆర్డీవో రత్న కల్యాణి అక్కడ ఉన్నారు. కౌన్సిలర్లంతా మీటింగ్​ హాల్లో కూర్చోగా వారికి హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ఆర్డీవో చెప్పారు. 

దీంతో అసమ్మతి కౌన్సిలర్లు అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్టే వస్తే ఇక్కడికి వచ్చేదాక తమకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తర్వాత ఆర్డీవో వెళ్లిపోతుండగా ఆమె కారును  అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. స్టే ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించగా మున్సిపల్ కమిషనర్ సమాధానం ఇస్తారని చెప్పి వెళ్లి పోయారు. కాగా, మున్సిపాలిటీలో కాంగ్రెస్​కు నలుగురు సభ్యులుండగా, వీరికి బీఆర్ఎస్​కు చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన మరొకరు, ఒక ఇండిపెండెంట్​మద్దతు పలుకుతున్నారు.  అసమ్మతి కౌన్సిలర్లకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం శుక్రవారం మున్సిపల్ ఆఫీసు ఆవరణలో మాట్లాడారు. స్టే ఆర్డర్​ను గౌరవిస్తున్నామని, న్యాయ నిపుణులతో సంప్రదించి అవిశ్వాస ప్రక్రియపై ముందుకు వెళ్తామన్నారు. కౌన్సిలర్లు కిషోర్ నాయక్, ఆఫ్రీన్ ఖానం, కుర్మా శ్రీను, కావాలి సంతు,  పౌజియా బేగం, స్రవంతి,  విజయ లక్ష్మీ, పరిమి లత పాల్గొన్నారు.