- థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఒకరు పరార్
- పీఎస్ముందు తల్లిదండ్రులు, బంధువులు, బీఆర్ఎస్ లీడర్ల ఆందోళన
- నిరసనల నేపథ్యంలో వదిలేసిన పోలీసులు
- మర్పల్లి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు
వికారాబాద్, వెలుగు: అదృశ్యం కేసు విచారణకు సంబంధించి ఇద్దరు అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే, పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారంటూ అందులోని ఓ యువకుడు స్టేషన్నుంచి పారిపోయాడు. దీంతో బాధిత కుటుంబాలు పీఎస్ముందు ధర్నాకు దిగాయి. వారికి మద్దతుగా బీఆర్ఎస్ లీడర్లు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వికారాబాద్‌జిల్లా మర్పల్లి మండలం పట్లూరుకు చెందిన మర్పల్లి రాములు అనే మతి స్థిమితం లేని వ్యక్తి వారం నుంచి కనిపించకుండా పోయాడు.
గ్రామ శివారులో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి శవం దొరకడంతో రాములుది కావచ్చనుకుని ఫిర్యాదు చేశారు. కొందరిపై అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు డీఎన్ఏ శాంపిల్స్తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. తర్వాత మర్పల్లి ఎస్సై సురేశ్మంగళవారం పట్లూరుకు చెందిన అన్నదమ్ములు మర్పల్లి ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు. విచారణ సందర్భంగా ప్రవీణ్పోలీసులను నెట్టివేసి పరారయ్యాడు.
చిత్రహింసలు తాళలేక పరారయ్యా: ప్రవీణ్
పోలీసులు పెట్టిన చిత్రహింసలు తట్టుకోలేకనే తాను పారిపోయానని ప్రవీణ్కుమార్మీడియాతోపాటు పోలీసు ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ లీడర్లకు సమాచారం ఇచ్చాడు. కండ్లల్లో కారం పొడి పోసి , తోలు బెల్ట్‌తో కొట్టారని, థర్డ్‌డిగ్రీ ట్రీట్మెంట్ఇచ్చారని ఆరోపించాడు. తన సోదరుడు నవీన్‌ను కూడా వదల్లేదని చెప్పాడు. తన తల్లిదండ్రులు మొగులయ్య, శ్యామలమ్మలను స్టేషన్ కు పిలిపించి కూర్చో పెట్టి హింసించారని చెప్పాడు. మంగళవారం ఉదయం వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పీఎస్‌కు వెళ్లారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా తమ కార్యకర్తలైన ప్రవీణ్, నవీన్ ను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు.
తర్వాత పీఎస్ముందు ప్రవీణ్, నవీన్కుటుంబీకులతో కలిసి పీఎస్ముందు ఆందోళనకు దిగారు. మోమిన్ పేట సీఐ నవీన్ కుమార్ ఇతర పీఎస్‌ల నుంచి పోలీసులను పిలిపించి బందోబస్తు ఏర్పాటు చేశారు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్ది మర్పల్లికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. చివరకు మెతుకు ఆనంద్ బాధిత కుటుంబాలతో కలిసి జిల్లా ఎస్పీ నారాయణరెడ్డికి మర్పల్లి ఎస్ఐ సురేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మర్పల్లి ఎస్సై అధికార పార్టీ లీడర్లకు కొమ్ము కాస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, గొడవ పెద్దది కావడంతో నవీన్‌తో పాటు ప్రవీణ్‌ను పోలీసులు విడుదల చేశారు.
మేం కొట్టలేదు: మోమిన్‌పేట సీఐ
కేసు విషయమై మోమిన్ పేట సీఐ నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేసు విషయంలో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించామని, పోలీసులు వారిని కొట్టలేదన్నారు. ఇందులో ప్రవీణ్ కుమార్ పరారయ్యాడని చెప్పారు.