కొనసాగుతున్న మహా హై డ్రామా!

కొనసాగుతున్న మహా హై డ్రామా!

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా కొత్త సర్కారు ఏర్పాటుపై ఇంకా హై డ్రామా కొనసాగుతోంది. సర్కారు ఏర్పాటుపై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన, ఎన్​సీపీ నేతలు శుక్రవారం ముంబైలో భేటీ కావాల్సి ఉండగా.. శివసేన చీఫ్, ఆపద్ధర్మ సీఎం ఏక్ నాథ్ షిండే అకస్మాత్తుగా తన సొంతూరుకు వెళ్లిపోవడంతో ఈ మీటింగ్ రద్దయింది. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్న మహాయుతి కూటమిలో బీజేపీ మరోసారి అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో ఆ పార్టీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం పదవి ఖాయమని తేలిపోయింది. 

సీఎం పదవి ఎవరు చేపట్టాలనేదానిపై బీజేపీ అగ్ర నేత అమిత్​షా, ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో గురువారం సాయంత్రం ఢిల్లీలో ఫడ్నవీస్, షిండే, ఎన్ సీపీ చీఫ్ అజిత్ పవార్ భేటీ అయ్యారు. అనంతరం షిండే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని మోదీ, అమిత్ షా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని, తన వల్ల కూటమికి ఎలాంటి ఆటంకం ఉండబోదని ప్రకటించారు. చర్చలు సానుకూలంగా కూడా జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ ముంబైకి చేరుకున్నారు. సాయంత్రం కూటమి భేటీలో కేబినెట్​లో మంత్రి పదవుల పంపకంపై చర్చించి ప్రభుత్వ ఏర్పాటును ఫైనల్ చేయాల్సి ఉండగా.. షిండే అకస్మాత్తుగా సతారా జిల్లాలోని తన సొంతూరు దారేకు వెళ్లిపోయారు. దీంతో సాయంత్రం జరగాల్సిన మహాయుతి మీటింగ్ రద్దయింది.

అసంతృప్తితోనే సొంతూరికి? 

ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత షిండే తన అధికారిక నివాసంలో శివసేన నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తన సొంతూరుకు వెళ్లిపోయారు. బీజేపీ నేతకు సీఎం పదవి, శివసేన, ఎన్​సీపీ నేతలకు చెరో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినందున.. షిండే అసంతృప్తితో ఉన్నారని, అందుకే మహాయుతి మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని సొంతూరుకు వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే సీఎంగా ఉన్న ఆయనకు ఫడ్నవీస్ సర్కారులో డిప్యూటీ సీఎంగా నెంబర్ టూ స్థానంలో ఉండటం ఇష్టం లేదని శివసేనలోని ఒక వర్గం నేతలు అంటున్నారు. 

మరో వర్గం నేతలు మాత్రం షిండే ప్రభుత్వంలో భాగస్వామి అయితేనే మంచిదని భావిస్తున్నారు. దీనిపై శివసేన అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే సంజయ్ సిర్సాత్ మాట్లాడుతూ.. షిండే డిప్యూటీ సీఎం పదవిని అంగీకరించకపోతే తమ పార్టీలోని మరో నేత ఆ పదవిని చేపడతారని చెప్పారు. అలాగే కేంద్ర మంత్రిగా వెళ్లేందుకూ షిండే సిద్ధంగా లేరన్నారు. అయితే, షిండే తన సొంతూరు నుంచి ఆదివారం తిరిగి ముంబైకి వస్తారని, ఆయన వచ్చాకే మహాయుతి మీటింగ్ జరుగుతుందని ఆ పార్టీ నేత ఉదయ్ సామంత్ వెల్లడించారు. షిండే అసంతృప్తితో ఉన్నారన్న వార్తలను ఖండించారు. సొంతూరుకు వెళ్లాల్సి ఉన్నందున ఆయన మీటింగ్ ను రద్దు చేసుకున్నారని, ఆదివారం తిరిగి ముంబైకి వస్తారన్నారు. 

డిప్యూటీతోపాటు హోంశాఖ కోసం షిండే పట్టు? 

బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకు.. సీఎం పదవితోపాటు కీలకమైన హోం శాఖను కూడా ఆ పార్టీ తన వద్దే ఉంచుకోనుందని, ఎన్ సీపీకి ఫైనాన్స్, శివసేనకు పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ శాఖలను అప్పగించనుందని తెలుస్తోంది. కేబినెట్ లో బీజేపీకి 22 బెర్తులను ఉంచుకుని, శివసేనకు 12, ఎన్ సీపీకి 9 మంత్రి పదవులను ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. అయితే, తొలుత డిప్యూటీ సీఎం పదవికి ఒప్పుకోని షిండే.. తనకు డిప్యూటీ సీఎంతో పాటు హోం శాఖను కూడా ఇస్తే ఓకే అని చెప్పినట్టు పేర్కొంటున్నారు. మొత్తంగా మహాయుతి కూటమిలో చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని.. డిసెంబర్ 2న కొత్త సర్కారు ప్రమాణ స్వీకారం నిర్వహించాలని నిర్ణయించినట్టుగా భావిస్తున్నారు.