లాయర్​తోనే విచారణకు వస్త.. లేదంటే వెళ్లిపోత : కేటీఆర్

 లాయర్​తోనే విచారణకు వస్త.. లేదంటే వెళ్లిపోత : కేటీఆర్
  • ఏసీబీ ఆఫీసు ముందు కేటీఆర్  హల్​చల్​.. పోలీసులతో వాగ్వాదం
  • ఒక్కరే రావాలని నోటీసుల్లో పేర్కొన్నామన్న ఏసీబీ ఆఫీసర్లు.. వినని కేటీఆర్​.. లెటర్​ ఇచ్చి తిరుగుముఖం
  • ఫార్ములా–ఈ రేసు కేసులోమళ్లీ ఏసీబీ నోటీసులు
  • ఈ నెల 9న హాజరుకావాలనికేటీఆర్​కు ఆదేశం.. ఫస్ట్​ నోటీసులకు సహకరించకపోవడంపై కోర్టుకు ఏసీబీ!
  • న్యాయస్థానంలో మెమో దాఖలుకు ఏర్పాట్లు
  • హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నది: కేటీఆర్​
  • విచారణకు పిలిచి.. తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నరని ఆరోపణ

హైదరాబాద్‌, వెలుగు: ఏసీబీ హెడ్‌క్వార్టర్స్‌ ముందు సోమవారం హైడ్రామా నడిచింది. ఫార్ములా –-ఈ రేస్‌ కేసులో ఏసీబీ విచారణ కోసం వచ్చిన బీఆర్‌‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. తనతో పాటు లాయర్‌‌ను కూడా ఏసీబీ ఆఫీస్‌లోకి వెళ్లనివ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్‌‌ను అనుమతిస్తే మాత్రమే విచారణకు వస్తానని.. లేకపోతే తిరిగి వెళ్లిపోతానని తెగేసి చెప్పారు. తన లాయర్​ సమక్షంలోనే తనను విచారించాలని కేటీఆర్​ పట్టుబట్టారు. తాను ఇక్కడ విచారణకు వస్తే.. అక్కడ తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పట్నం నరేందర్‌‌ రెడ్డిని కూడా ఇలానే చేశారంటూ దాదాపు 40 నిమిషాల పాటు రోడ్డుపై హల్​చల్​ చేశారు. 

చివరికి ఏసీబీ అధికారులే కేటీఆర్‌ వద్దకు వచ్చి.. నోటీసుల్లో పేర్కొన్న అంశాలను మరోసారి గుర్తుచేశారు. ‘‘కేటీఆర్ ఒక్కరు మాత్రమే వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టంగా ఉంది. న్యాయవాది సహా ఇతరులకు అనుమతి లేదు. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తుకు సహకరించాలి” అని సూచించారు. అయినా కేటీఆర్​ వినలేదు. లాయర్‌‌ను అనుమతిస్తే తప్ప విచారణకు రానని అన్నారు. క్వాష్  పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వులో ఉందని.. తన నుంచి ఎలాంటి సమాచారం కోరుతున్నారో తెలియజేయాలని పేర్కొంటూ ఏసీబీ అధికారులకు ఓ లెటర్‌‌ను అందించారు. ఆఫీసు దాకా వచ్చి.. విచారణకు హాజరుకాకుండానే ఆయన తిరిగి వెళ్లిపోయారు. 

9న రావాలని మరో నోటీస్‌ కేటీఆర్‌‌ విచారణకు  హాజరుకాకుండా వెళ్లిపోవడంతో ఏసీబీ అధికారులు అలర్ట్​ అయ్యారు. విచారణకు సహరించకుండా కేటీఆర్ ఎత్తులు  వేస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే చట్టప్రకారం వరుస నోటీసులు జారీ చేస్తున్నారు. సోమవారం న్యాయనిపుణులతో భేటీ అయ్యారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఈ నెల 9న తమ ముందు విచారణకు హాజరుకావాలని కేటీఆర్​కు సాయంత్రం మరో నోటీస్ పంపారు. గచ్చిబౌలిలోని ఓరియన్‌‌ విల్లాస్‌‌లో ఉన్న కేటీఆర్‌‌‌‌కు నోటీస్‌‌ కాపీ అందించారు. ఫార్ములా–ఈ రేస్‌‌ కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు సహరించాలని అందులో సూచించారు.

 9వ తేదీన ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌‌లోని ఏసీబీ హెడ్‌‌ క్వార్టర్స్‌‌లో దర్యాప్తు అధికారి మాజీద్‌‌ అలీ ఖాన్‌‌ ముందు హాజరుకావాలని పేర్కొన్నారు. దీంతో సెకండ్‌‌ నోటీసుల ప్రక్రియ కూడా పూర్తయింది. మొదటి నోటీసుల్లో పేర్కొన్నట్లు విచారణకు కేటీఆర్​ సహకరించకపోవడం గురించి కోర్టులో మెమో దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు కేటీఆర్‌‌‌‌ సహా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఇండ్లలో సోదాలు చేసేం దుకుగాను సెర్చ్‌‌ వారెంట్‌‌ కోసం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. 

ఓరియన్​ విల్లా నుంచి ఏసీబీ ఆఫీస్‌‌ దాకా..!

2023 ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా–ఈ రేస్‌‌ సీజన్ 9 సహా 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్‌‌10 వ్యవహారంలో హెచ్‌‌ఎండీఏ బోర్డుకు చెందిన రూ. 54.89 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాడు మున్సిపల్​ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్​ ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం నడిచినట్లు ఫిర్యాదులు అందడంతో.. ఏ1గా కేటీఆర్​ను చేర్చి ఏసీబీ అధికారులు గత నెల 18న ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ను క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్‌‌ ‌‌దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉంది. కేటీఆర్‌‌‌‌ను అరెస్ట్ చేయకుండానే కేసు దర్యాప్తు చేసుకోవచ్చన్న హైకోర్టు ఆదేశాల మేరకు గత శుక్రవారం ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. 

దీంతో సోమవారం ఉదయం 10.30 గంటలకు కేటీఆర్ ఏసీబీ ముందు హాజరుకావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గచ్చిబౌలిలోని ఓరియన్‌‌ విల్లా నుంచి కేటీఆర్ బయలుదేరారు. జూబ్లీహిల్స్‌‌ నందినగర్‌‌‌‌లోని తన ఇంటికి వచ్చారు. నందినగర్‌‌‌‌లోని ఇంట్లో అక్కడ కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, తన లీగల్ టీమ్‌‌తో కొద్దిసేపు ఆయన చర్చించారు. లీగల్‌‌టీమ్‌‌ న్యాయవాదులతో కలిసి ఉదయం 9.50 గంటల ప్రాంతంలో నందినగర్‌‌ ‌‌నుంచి బంజారాహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్‌‌ ‌‌12లోని ఏసీబీ హెడ్‌‌క్వార్టర్స్​కు బయలుదేరారు. సరిగ్గా 10 గంటల వరకు ఏసీబీ ఆఫీస్ సమీపంలోకి వచ్చారు.

 అయితే కేటీఆర్‌‌‌‌ విచారణ నేపథ్యంలో బీఆర్‌‌‌‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగుతారనే సమాచారంతో పోలీసులు అప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ ఆఫీస్‌‌కు వచ్చే అన్ని రోడ్లలో బారికేడ్లు పెట్టారు. ఈ క్రమంలో రోడ్‌‌ నంబర్‌‌‌‌12లోని మెయిన్ రోడ్డుపైనే పోలీసులు కేటీఆర్‌‌‌‌ వెహికల్​ను  అడ్డుకున్నారు. కేటీఆర్‌‌ ‌‌మినహా లాయర్లు, ఇతరులకు లోపలికి అనుమతి లేదని చెప్పారు. దీంతో కేటీఆర్‌‌‌‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను లాయర్​తోనే లోపలికి వెళ్తానని.. లేకపోతే విచారణకు వెళ్లబోనని అన్నారు.

 అక్కడున్న పోలీసులు.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు  40 నిమిషాల పాటు కేటీఆర్‌‌ ‌‌రోడ్డుపైనే హల్​చల్​ చేశారు. చివరికి ఇద్దరు ఏసీబీ అడిషనల్ ఎస్పీలు వచ్చి.. న్యాయవాదికి అనుమతి లేదని, ఇదే విషయం నోటీసుల్లో పేర్కొన్నామని గుర్తుచేశారు. ఇందుకు సంబంధించి కోర్టు ఆదేశాలు, సీఆర్‌‌‌‌పీసీ గురించి వివరించారు. ఉదయం10.40 గంటల వరకు రోడ్డుపైనే హైడ్రామా నడిచింది. ఏసీబీ ఆఫీస్‌‌లో దర్యాప్తు అధికారి మాజీద్ అలీకి ఇవ్వాలనుకున్న లెటర్​ను డిప్యూటీ డైరెక్టర్లు నరేందర్‌‌‌‌, శివరామ్​కు కేటీఆర్​ అందించి వెళ్లిపోయారు.  

హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నది: కేటీఆర్​

సొంత రాజ్యాంగాన్ని అమలుచేయాలన్న దురాలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్​ దుయ్యబట్టారు. ‘‘రాజ్యాంగబద్ధంగా దక్కిన హక్కులను కాలరాసేలా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. గతంలో లగచర్ల కేసులో మా పార్టీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేశారు. ఆయన చెప్పని అసత్యాలతో కూడిన  స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేసి మీడియాకు రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారు. 

ALSO READ : విచారణకు రాలేను..ఈడీ నోటీసులకు కేటీఆర్ రిప్లై

నన్ను విచారిస్తూనే.. మా ఇంట్లో సోదాలు చేస్తారని తెలిసింది. ఇంట్లో మా మామ రెండో సంవత్సరికం జరుగుతున్నది. అది కూడా డిస్టర్బ్‌‌ చేస్తారనే అనుమానం ఉంది. విచారణకు న్యాయవాదులు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య ఏంటో చెప్పాలి? విచారణ పేరుతో పిలిచి తన ఇంటిపైన అక్రమంగా దాడులు నిర్వహించేందుకు రేవంత్​రెడ్డి ప్లాన్  చేశారు. ఇంట్లో ఫ్యాబ్రికేటెడ్‌‌, చట్ట వ్యతిరేకమైన వస్తువులను ఉంచేందుకు కుట్ర కూడా జరుగుతున్నది” అని ఆయన ఆరోపించారు.

 అటెన్షన్ డైవర్షన్​లో భాగమే ఏసీబీ విచారణ చేపట్టారని మీడియాతో వ్యాఖ్యానించారు.  ‘‘రేవంత్ రెడ్డిని ఎవరైతే విమర్శిస్తున్నారో వారిని అరెస్టు చేయడమే రెండో పనిగా పెట్టుకున్నడు. ఎన్ని అటెన్షన్  డైవర్షన్‌‌లు చేసినా ప్రభుత్వ వైపల్యాలను ఎండగడుతూనే ఉంటాం’’ అని కేటీఆర్​ చెప్పారు. 

ఏసీబీకి కేటీఆర్​ ఇచ్చిన  లెటర్‌‌‌‌లో ఏముందంటే..!

‘‘డిసెంబర్ 18న నమోదు చేసిన ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ సంబంధించిన క్వాష్​ పిటిషన్​పై హైకోర్టులో 31న తుది వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వులో ఉంది. ఆర్డర్స్‌‌ ఎప్పుడైనా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్స్ పెండింగ్‌‌లో ఉండగానే విచారణకు రావాలంటూ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంట్లు, సమాచారం అందించాలని కోరారు. కానీ.. నా నుంచి ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాలో నోటీసుల్లో పేర్కొనలేదు. 

మీరు ఎలాంటి సమాచారం కోరుతున్నారో స్పష్టంగా తెలియజేయాలి. అందుకు తగ్గట్టు సమయం ఇవ్వాలి. నేను చట్టాన్ని గౌరవిస్తాను. హైకోర్టు ఆదేశాలకు తగ్గట్టు విచారణకు సహకరిస్తున్నాను. నాకు న్యాయవాదిని వెంట తెచ్చుకునే అవకాశం ఉంది. కోర్టు తీర్పు వెల్లడించే వరకు అవకాశం ఇవ్వండి. తీర్పుకు తగ్గట్టు చర్యలు తీసుకోండి” అని ఏసీబీ ఆఫీసులో ఇచ్చిన లెటర్​లో కేటీఆర్​ పేర్కొన్నారు.