- రూ.125 కోట్లతో నిర్మాణానికి సర్కార్ ఆమోదం
- తగ్గనున్న ఉమ్మడి జిల్లా వాసుల ప్రయాణ భారం
- చొరవచూపిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి ఏర్పాటులో మరో ముందడుగు పడింది. మంచిర్యాల జిల్లా శివ్వారం, పెద్దపల్లి జిల్లా మంథనిని కలుపుతూ గోదావరి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి సర్కార్ ఇటీవల ఆమోదం తెలిపింది. రూ.125 కోట్లు కేటాయిస్తూ టెండర్ల కోసం ఉత్తర్వులు సైతం జారీ చేయడంతో రహదారి ఏర్పాటుకు మార్గం ఏర్పడింది. రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో నేషనల్ హైవేలో గోదావరి నదిపై బ్రిడ్జి ఏర్పాటు కానుంది. త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇటీవల క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన విజయోత్సవ ఆత్మీయసభలో ప్రకటించారు.
రాష్ట్రాల అనుసంధానం
మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడేందుకు జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద నాగ్‌పూర్-–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో మంచిర్యాల జిల్లాను గతంలోనే అనుసంధానం చేశారు. ఇందులో భాగంగా వరంగల్–-మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణానికి 2023 జులై7న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 112 కి.మీ. ఉండే ఈ గ్రీన్‌ఫీల్డ్స్ రహదారిని రూ.3,441 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.
మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. 164 హైవేగా వ్యవహరించే రహదారిని కేంద్ర ప్రభుత్వం 2020 డిసెంబర్లో ప్రతిపాదించి 2021 మార్చి3న గ్రీన్సిగ్నల్ఇస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మంచిర్యాల–-చెన్నూర్ నేషనల్ హైవే 63ను ఆనుకొని జైపూర్ మండలం నర్వ శివారులోని రసూల్‌పల్లి సమీపం నుంచి ఎస్టీపీపీ రైల్వే ట్రాక్, ఎల్కంటి, షెట్పల్లి ఎక్స్‌రోడ్, నర్సింగపూర్, మద్దులపల్లి, కుందారం, కిష్టాపూర్, వేలాల, గోపాలపూర్ మీదుగా గోదావరి నది దాటి పెద్దపల్లి జిల్లా మంథని, టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర మండలం, పట్టణ కేంద్రాల మీదుగా వరంగల్ వరకు రహదారి నిర్మించనున్నారు. మంచిర్యాల, -పెద్దపల్లి మధ్య గోదావరి నది, పెద్దపల్లి, -భూపాలపల్లి జిల్లా మధ్యలోని మానేరు నదిపై భారీ బ్రిడ్జిలు నిర్మిస్తారు.
ఫోర్ లేన్ నిర్మాణానికి 4 జిల్లాల పరిధిలో 1,767 ఎకరాల భూములను సేకరించాలని ఆఫీసర్లు నిర్ణయించారు. 2022 మార్చిలో జైపూర్ మండలం షెట్పల్లి కేంద్రంగా భూముల సేకరణ కోసం ఆఫీసర్లు ప్రజాభిప్రాయసేకరణ కూడా చేపట్టారు. 2023 ఫిబ్రవరిలో నిర్వాసిత రైతులకు నోటీసులు జారీ చేసిన ఆఫీసర్లు.. పరిహారం కోసం అవార్డు ప్రకటించలేదు.
సగానికిపైగా తగ్గనున్న దూరాభారం
మంచిర్యాల నుంచి మంథనికి రావాలంటే గోదావరిఖని మీదుగా 70 కి.మీ. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే మంచిర్యాల-– వరంగల్ జాతీయ రహదారిలో గోదావరి నదిపై హైలెవల్ వంతెన అందుబాటులోకి వస్తే చెన్నూరు నుంచి మంథనికి కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సగానికి పైగా దూరభారం తగ్గనుంది. మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లా వాసులు వరంగల్ వెళ్లడానికి, సరుకుల రవాణా ఈజీ కానుంది.