
న్యూఢిల్లీ: భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీ కాలం 2025, ఫిబ్రవరి 18న ముగినున్న విషయం తెలిసిందే. దీంతో తదుపరి సీఈసీ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే.. సోమవారం (ఫిబ్రవరి 17) ప్రధాని మోడీ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సెలక్షన్ కమిటీలో ప్రధాని, లోక్ సభ ప్రతిపక్ష నేతతో పాటు ప్రధాని సూచించిన ఒక కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు.
సోమవారం జరిగిన ఈ హైలెవల్ కమిటీ భేటీలో ప్రధాని మోడీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు తదుపరి సీఈసీ ఎంపికపై కమిటీ చర్చించింది. సెర్చ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన వారిలో ఒకరి పేరును హైలెవల్ కమిటీ రాష్ట్రపతికి సిపార్సు చేయనున్నారు. కమిటీ సిఫార్సు అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తదుపరి సీఈసీని నియమిస్తారు.
ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ 2020 మేలో భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయన హయాంలో జరిగాయి. అయితే.. సీఈసీ రాజీవ్ కుమార్‌పై విపక్షాలు పెద్ద ఆరోపణలు చేశాయి. రాజీవ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి తొత్తులాగా మారారని రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ వంటి నేతలు పలుమార్లు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో రాజీవ్ కుమార్ తర్వాత అత్యంత సీనియర్ ఈసీగా జ్ఞానేష్ కుమార్ ఉన్నారు.
గతంలో ఆయన పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా, హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీనియర్ కావడంతో పాటు 2029, జనవరి 25 పదవ కాలం ఉండటంతో కేంద్రం జ్ఞానేష్ కుమార్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జ్ఞానేష్ కుమార్ పేరునే సిఫారస్ చేయనున్నట్లు టాక్. మరీ కేంద్రం జ్ఞానేష్ కుమార్ కే సీఈసీ బాధ్యతలు అప్పగిస్తుందా లేదా చివరి నిమిషంలో కొత్త పేరును తెరపైకి తెస్తుందా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.