నగరంలో కుక్కల దాడులపై ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం కుక్కల విషయంలో 8 ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో మంత్రి తలసాని ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని తలసాని తెలిపారు. పట్టుకున్న కుక్కల్ని స్టెరిలైజ్ చేస్తామని చెప్పారు.
మాంసపు షాపుల వద్ద కుక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయని మంత్రి తలసాని అన్నారు. ఇండ్లు, షాపుల వద్ద వ్యర్ధపు మాంసం వాటికి వేయటం వల్ల కుక్కలు అలవాటు పడుతాయని చెప్పారు. మటన్, చికెన్ షాపుల వద్ద రేపటి నుండి స్పెషల్ డ్రైవ్ ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్ ద్వారా నగరవాసులు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. అలాగే... చనిపోయిన జంతువుల దహనానికి కొన్ని సూచించిన ప్రాంతాల్లోనే దహనం చేయాలని సూచించారు. కుక్కల దాడుల ఘటనలపై విమర్శలు చేసే వాళ్లకు తాము సమాధానం చెబుతామని మంత్రి తలసాని స్పష్టం చేశారు.