డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచండి .. ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సు

డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచండి .. ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సు
  • 16 ఏండ్లుగా స్టూడెంట్ల కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు
  • డిప్యూటీ సీఎం భట్టికి నివేదిక అందజేసిన కమిటీ

హైదరాబాద్, వెలుగు: రెసిడెన్షియల్, వెల్ఫేర్ హాస్టల్స్​లో చదువుతున్న స్టూడెంట్ల కాస్మోటిక్, డైట్ చార్జీలు 40 శాతం పెంచాలని ఉన్నతాధికారుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాస్మోటిక్ చార్జీలు 16 ఏండ్లుగా, డైట్ చార్జీలు ఏడేండ్లుగా పెంచలేదని రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. దీంతో 7,65,705 మంది స్టూడెంట్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వీటి చార్జీలు పెంచాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిని ఇటీవల మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ కలిసి కోరారు.

 ఈ మేరకు ఈ నెల 17న బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అధ్యక్షతన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్ టీకే శ్రీదేవి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్​తో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బీసీ గురుకుల సెక్రటరీ సైదులు, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి, మైనార్టీ గురుకుల సెక్రటరీ తఫీర్ ఇక్బాల్, ట్రైబల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న జవహార్ నవోదయలో ఉన్న చార్జీలు, గత ఏడేండ్ల ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరల వంటి అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్​ను కూడా స్టడీ చేసింది. కంప్లీట్ రిపోర్టును సోమవారం డిప్యూటీ సీఎం భట్టికి కమిటీ అందజేసింది.