మంచిర్యాల, వెలుగు : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు ఆధ్వర్యంలో తలపెట్టిన ‘చలో ప్రగతిభవన్’ ప్రోగ్రాంను పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ ప్రగతి భవన్ బయలుదేరిన రఘునాథ్ తో పాటు ఆ పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్అసెంబ్లీ సాక్షిగా చెప్పి మోసం చేశారని విమర్శించారు. కోల్ ఇండియాలో హైపవర్ కమిటీ వేతనాలు ఇస్తుండగా సింగరేణిలో మాత్రం చాలీచాలని జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. కార్మికుల డిమాండ్ల సాధన కోసం ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
నాయకులు వంగపల్లి వెంకటేశ్వర్రావు, రజినీష్ జైన్, జీవీ.ఆనంద్ కృష్ణ, పానుగంటి మధు, బొద్దున మల్లేశ్, ముదాం మల్లేశ్, అమిరిషెట్టి రాజు, బండి మల్లికార్జున్ పాల్గొన్నారు.