
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ శాఖ యోచిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకును పూర్తిగా తొలగించడంతో పాటు డిజైన్ల పునఃపరిశీలనకు ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ రిపోర్టులో సిఫార్సు చేయడంతో ఏం చేయాలన్న దానిపై హైపవర్ కమిటీ ద్వారానే నిర్ణయించాలని ఆలోచనలు చేస్తున్నది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది.
నివేదికపై ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రిపేర్లకు ఎంత సమయం పడుతుంది? వంటి వాటిపై సమగ్రంగా అధ్యయనం చేయించాలని భావిస్తున్నది. ఎన్‌డీఎస్‌ఏ సూచించిన టెక్నికల్ ఎవాల్యుయేషన్‌ను ఎలా చేయాలి.. ఏ సంస్థలకు అప్పగించాలన్న దానిపైనా ఈ కమిటీ ద్వారానే ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. టెక్నికల్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో కమిటీని ఏర్పాటు చేసి.. ఆయా అంశాలపై సమగ్ర నివేదికను తయారు చేయించాలని యోచిస్తున్నది. ఇప్పటికే దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.