కరెంట్​పోతే క్లాసులు బంద్..ఆరుబయటే వంటలు, రోడ్డుపైనే తిండి

కరెంట్​పోతే క్లాసులు బంద్..ఆరుబయటే వంటలు, రోడ్డుపైనే తిండి
  • 20 మంది కూర్చోవాల్సిన క్లాసులో 45 మంది
  • టాయిలెట్లు లేక ఇబ్బందులు  పడుతున్న స్టూడెంట్స్​
  • అధ్వానంగా కేసీఆర్​ నగర్​లోని మోడల్ ​కాలనీ స్కూళ్లు

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్ మోడల్ కాలనీలో ఉన్న హై స్కూల్, ప్రైమరీ స్కూళ్లు సమస్యలతో సతమతమవుతున్నాయి. నంగునూరు మండలం అక్కెనపల్లిలో ఉండాల్సిన జడ్పీహెచ్ఎస్ స్కూల్ ను అక్కడ జీరో స్ట్రెంథ్​ఉండడంతో సిద్దిపేట కేసీఆర్ నగర్ కు తరలించి ఇక్కడ అడ్మిషన్లు తీసుకుని క్లాసులు నిర్వహిస్తున్నారు. గుండ్ల చెరువులో ఉండాల్సిన ప్రైమరీ స్కూల్ ను కరోనా సమయంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ కావడంతో అక్కడ స్థలం సరిపోకపోవడంతో, ఇక్కడికి తరలించి పాఠాలు బోధిస్తున్నారు.

కాగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయించిన బ్లాకుల్లో ఈ స్కూళ్లను నడుపుతుండడంతో స్టూడెంట్స్ తో పాటు టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో తరగతిలో 40 నుంచి 45 మంది స్టూడెంట్స్​ఉండగా, ఆ గదులు కేవలం 20 మందికి సరిపోయేలా ఉండడంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. రూములకు సరైన వెంటిలేషన్ లేకపోవడం, సరిపడా ఫర్నిచర్ లేకపోవడంతో కింద కూర్చొని విద్యనభ్యసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

వంట, తిండి ఆరుబయటే..

హై స్కూల్ లో వంట చేసేందుకు సపరేట్ గా వంట గది ఉన్నప్పటికీ  ప్రైమరీ స్కూల్ కు వంట గది లేకపోవడంతో సిబ్బంది ఆరుబయటే వంటలు వండాల్సి వస్తోంది. రోడ్డుపైనే కూరగాయలు కట్ చేయడం, అక్కడే వంటలు  చేస్తుండడంతో, దుమ్ము ధూళి అందులో పడుతుండడంతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. వంటల అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో తినడానికి డైనింగ్ రూం లేకపోవడంతో రోడ్డుపైనే తినాల్సి వస్తోంది.

సరైన వెంటిలేషన్​లేదు..

రూమ్​లకు  సరైన వెంటి లేషన్ లేకపోవడంతో కరెంట్ పోయిన సమయంలో క్లాసులను బంద్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని టీచర్లు వాపోతున్నారు.  స్కూళ్ల చుట్టూ ముళ్ల పొదలు, పిచ్చి చెట్లు పెరిగి తేళ్లు, పాములు వస్తున్నాయని, పిల్లలు భయంగా గడుపుతున్నారని వాపోయారు. ఉన్న కొన్ని టాయిలెట్స్ ను విద్యార్థినులకు కేటాయించడంతో మగపిల్లలు, టీచర్లు అర్జెంట్ అయితే బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, స్కూళ్లను సరైన, విశాలమైన  భవనాల్లోకి తరలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.