విద్యార్థినుల సమస్యలకు కంప్లయింట్​ బాక్సులతో చెక్

  • జీసీఈసీ క్లబ్స్​లో భాగంగా హైస్కూళ్ల​లో ఏర్పాటు
  • పేరు లేకుండా ఫిర్యాదు చేసే చాన్స్  
  • ధైర్యంగా ముందుకు వస్తున్న అమ్మాయిలు
  • ముషీరాబాద్​ పరిధిలోని స్కూల్​లో టీచర్​ లైంగిక వేధింపులపై 16 కంప్లయింట్స్ 
  • పోక్సో కేసు నమోదు, సస్పెండ్​ చేసిన డీఈఓ
  • జిల్లాలోని అన్ని హైస్కూళ్లలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్​  

హైదరాబాద్ సిటీ, వెలుగు:ప్రభుత్వ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన కంప్లయింట్​బాక్సులు సత్ఫలితాలిస్తున్నాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి విద్యార్థినులు కంప్లయింట్స్​ బాక్సుల ద్వారా తెలియజేస్తున్నారు. ఇదివరకు స్కూళ్లలో టీచర్లు అసభ్యంగా ప్రవర్తించినా, తోటి స్టూడెంట్స్ ఇబ్బందులు పెట్టినా, స్కూల్​బయట ఈవ్​టీజింగ్​చేసినా బయటకు చెప్పుకోలేక మౌనంగా భరించేవారు. కానీ, ఇప్పుడు ధైర్యంగా గర్ల్​ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్(జీసీఈసీ) ద్వారా ఏర్పాటు చేసిన బాక్సుల్లో కంప్లయింట్​లెటర్లు వేసి తెలియజేస్తున్నారు. అందులో పేరు రాయాల్సిన అవసరం లేకపోవడంతో తమ సమస్యలను ధైర్యంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. 

ఒకే టీచర్​పై 16 కంప్లయింట్స్

ఇటీవల ముషీరాబాద్ పరిధిలోని ఓ ప్రభుత్వ స్కూల్​లో జీసీఈసీ ఏర్పాటు చేసిన కంప్లయింట్​ బాక్స్​ను ఓపెన్​చేసి చూడగా అందులో 16 ఫిర్యాదులు వచ్చాయి. అన్ని ఫిర్యాదుల్లో స్కూల్​ టీచర్​ సురేశ్​తరచూ తమను ఏదో ఒక వంకతో తాకుతున్నాడని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని రాశారు. ఈ సమాచారం పోలీస్​భరోసా టీమ్స్​కు చేరడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

Also Read : ఆ తెలంగాణ తల్లిని గాంధీభవన్​కు పంపిస్తం

విద్యార్థినుల ఫిర్యాదులు నిజమేనని తేలడంతో 10 రోజుల కింద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల రిపోర్ట్ ఆధారంగా గత గురువారం హైదరాబాద్ జిల్లా డీఈఓ ఆర్.రోహిణి టీచర్​సురేశ్​ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, సురేశ్​డిప్యూటేషన్​పై ముషీరాబాద్​పరిధిలోని స్కూల్​లో డ్యూటీ చేస్తున్నాడు. గతంలో పనిచేసిన స్కూల్​లోనూ అతనిపై ఇలాంటి ఆరోపణలే రాగా, చర్యలు తీసుకోకుండా డిప్యూటేషన్​పై పంపినట్లు సమాచారం.

ప్రతి శుక్రవారం ఓపెన్​చేస్తరు

స్కూల్​ విద్యార్థినులకు ఈవ్​టీజింగ్, చైల్డ్​మ్యారేజెస్, ఫినాన్సియల్​ లిటరసీ, ఆరోగ్యంపై అవగాహన, వయలెన్స్, తదితర అంశాల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్ జిల్లాలో 100 హైస్కూళ్లలో గర్ల్​ చైల్డ్​ఎంపవర్​మెంట్ క్లబ్బులను ఏర్పాటు చేశారు. ఈ క్లబ్బులకు చైర్మన్​గా హెడ్​మాస్టర్, మెంబర్​గా స్టూడెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉండే టీచర్​, 6 నుంచి10 తరగతి వరకు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు, స్థానిక పీఎస్​నుంచి లేడీ కానిస్టేబుల్, ఉమెన్​అండ్​చైల్డ్​వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​నుంచి ఒకరు​సభ్యులుగా ఉంటారు.ఈ  స్కూళ్లలో సమస్యలు, టీచర్ల ప్రవర్తనతో పాటు  సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈ క్లబ్బుల ద్వారా ప్రతీ స్కూల్​ లో ఒక కంప్లయింట్​బాక్స్​ఏర్పాటు చేశారు.

ఈ బాక్సులను ప్రతి శుక్రవారం క్లబ్ మెంబర్స్​ఆధ్వర్యంలో ఓపెన్​ చేసి సమస్యలపై చర్చించి పరిష్కరిస్తారు. తీవ్రతను బట్టి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అయితే, వంద స్కూళ్లలో కంప్లయింట్​బాక్సులు ఏర్పాటు చేశామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ అందులో వాస్తవం లేదన్న ఆరోపణలున్నాయి. ముషీరాబాద్ ఘటన తర్వాత కొన్ని స్కూళ్లలో ఈ మధ్యే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. జీసీఈసీ స్కూల్స్​లోనే కాకుండా మొత్తం జిల్లాలోని 182 స్కూల్స్​లో కంప్లయింట్​బాక్సులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్​వినిపిస్తోంది.  

అమ్మాయిలూ..  ధైర్యంగా ఫిర్యాదు చేయండి 

జీసీఈసీ క్లబ్బులు ద్వారా స్కూళ్లలో ఏర్పాటు చేసిన కంప్లయింట్​ బాక్సులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.  ఇబ్బందులను బయటకు చెప్పడానికి ఇష్టపడని పిల్లలు తమ పేర్లు రాయకుండా సమస్యను రాసి బాక్సుల్లో వేయొచ్చు. స్కూళ్లలో జరిగినవే కాదు..బయట వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలియజేయొచ్చని హైదరాబాద్ డీఈవో ఆర్. రోహిణి తెలిపారు.