
- ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ టెండర్లు
- ముంబై - అహ్మదాబాద్ తరహాలో ఈ రెండు మార్గాలకు ప్రతిపాదనలు
- కొత్త లైన్లు పూర్తయితే 2 గంటల్లోనే జర్నీ
హైదరాబాద్, వెలుగు: మన గమ్య స్థానానికి విమానంలో చేరుకునే సమయంలోనే ట్రైన్లో చేరుకుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది నిజం అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగుళూరుకు కేవలం 2 గంటల్లో చేరుకోవడం ఫ్లైట్ లోనే సాధ్యం. అయితే, రానున్న రోజుల్లో హైస్పీడ్ ట్రైన్లో కూడా ఇది సాధ్యం కాబోతున్నది. దీని కోసం రైల్వే అధికారులు ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) కు టెండర్లను ఆహ్వానించారు. దీన్ని రైల్వే బోర్డు ఆమోదిస్తే రాబోయే ఎనిమిదేండ్లలో హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరుకు హైస్పీడ్ ట్రైన్ లో రెండు గంటల్లోనే ప్రయాణించవచ్చు. హైస్పీడ్ ట్రైన్ అందుబాటులోకి వస్తే దాదాపు 10 గంటల సమయం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న రైళ్లలో 12 గంటల సమయం పడుతోంది. ముంబై– అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ నమూనాతోనే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు హైస్పీడ్ ట్రైన్ కారిడార్లకు ఎఫ్ఎల్ఎస్ టెండర్లను పిలవనున్నారు.
గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్‌తో..
గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ హైస్పీడ్ రైలుకు హైదరాబాద్ నుంచి చెన్నై రూట్ లో 705 కి.మీ ప్రతిపాదించగా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 626 కి. మీ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్పీడ్ తో హైదరాబాద్ నుంచి చెన్నైకి 2 గంటల్లో, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ నుంచి బెంగళూరుకు ఫ్లైట్‌లో గంట 15 నిమిషాలు, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక గంట 20 నిమిషాలు పడుతోంది. ఎయిర్ పోర్టుల నుంచి ఆయా సిటీల్లోకి చేరుకునేందుకు కనీసం మరో 40 నిమిషాలు పడుతుంది. అంటే ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై చేరుకోవాలంటే 2 గంటల సమయం చొప్పున పడుతోంది. హైస్పీడ్ రైలులో కూడా దాదాపుగా ఇంతే సమయం పడుతుంది. అయితే హైస్పీడ్ రైళ్ల కోసం ప్రత్యేక ట్రాక్ లను ఏర్పాటు చేయాల్సి ఉన్నందున మొదటి దశలో ఎఫ్ఎల్ఎస్ సర్వే చేసేందుకు టెండర్లను ఆహ్వానించారు. ఈ సర్వేను కేంద్ర రైల్వే బోర్డుకు పంపిస్తారు. దీన్ని బోర్డు ఆమోదిస్తే.. భౌగోళికమైన మ్యాపింగ్, భూమి స్వభావంపై పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత బ్రిడ్జింగ్, టన్నెలింగ్, బిల్డింగ్స్, ఇతర నిర్మాణాలతో సహా వివరణాత్మక అంచనాలతో టెండర్లు పిలుస్తారు.