మరో ఐదురోజులు వడగాడ్పులు

రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు

ఆదిలాబాద్‌‌లో అత్యధికంగా 46.3 డిగ్రీల టెంపరేచర్​

వడదెబ్బకు ముగ్గురి మృతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే మూడు రోజులుగా దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. ఎండలు కూడా మండిపోతున్నాయి. పొద్దున ఎనిమిది గంటలకే మొదలవుతున్న వేడి గాడ్పులు.. సాయంత్రం 6 దాటినా వీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర ఎక్కువ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల మేర ఉంటుండంతో జనం అవస్థ పడుతున్నారు. ఎక్కువ టెంపరేచర్లు, వడగాడ్పులతో బయటికి రావడానికే భయపడుతున్నారు.

ఆదిలాబాద్​లో 46.3 డిగ్రీలు

రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో టెంపరేచర్లు ఎక్కువగా రికార్డవుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా భోరజ్‌‌‌‌ లో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. మంచిర్యాలలోని జన్నారం, కామారెడ్డిలోని కొల్లూరుల్లో 45.9, ఆదిలాబాద్‌‌‌‌లోని తాంసిలో 45.8 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్‌‌‌‌ లోనూ సాధారణం కంటే ఎక్కువ వేడి ఉంటోంది. ఆదివారం 44 డిగ్రీల టెంపరేచర్‌‌‌‌ నమోదైంది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలను చూస్తే.. అత్యధికంగా వనపర్తి జిల్లాలో 29.6, హైదరాబాద్‌‌‌‌లో 28.8, మంచిర్యాలలో 28.7 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లో రాత్రి టెంపరేచర్లు 26 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉండటం గమనార్హం.

కొన్ని చోట్ల మరీ తీవ్రంగా..

రాష్ట్రంలో ఆదివారం 30 చోట్లకు పైనే వడగాడ్పులు వీశాయని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 28వ తేదీ వరకు చాలా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. కొన్నిచోట్ల మరింత తీవ్రంగా వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. సోమవారం నాడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్-అర్బన్‌‌‌‌, వరంగల్-రూరల్‌‌‌‌, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది.

వడదెబ్బతో ముగ్గురి మృతి

వెలుగు నెట్​వర్క్: వడదెబ్బతో  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం ముగ్గురు మృతిచెందారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం రాఘవపురం తండాకు చెందిన ఇస్లావత్ సైదా(41) లారీ క్లీనర్ గా చేస్తున్నాడు. ఆదివారం లారీ అసోసియేషన్ ఆవరణలో వడ దెబ్బకు గురై మృతిచెందాడు. మెదక్​జిల్లా రామాయంపేట మండలంలోని రాయలాపూర్ కు చెందిన రొడ్డ నర్సింలు(70) రెండు రోజులుగా ఉపాధి పనులకు వెళుతున్నాడు. ఎండలో పని చేయడం వల్ల ఆదివారం అస్వస్థతకు గురి కాగా అతన్ని  రామాయంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్​తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన కొత్తపల్లి వెంకటయ్య(65) కార్పెంటర్. శనివారం వ్యక్తిగత పనుల మీద ఎండలో తిరిగారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాంతులు అవుతుండడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందారు.

For More News..

టెన్త్ ఎగ్జామ్స్ కుదించాలి

బర్త్‌‌ డేకు పిలిచి.. మత్తు మందు కలిపి