హైదరాబాద్సిటీ, వెలుగు: సకాలంలో బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్ ముందు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.1,500 కోట్ల బిల్లుల పెండింగ్పెట్టారని కాంట్రాక్టర్లు వాపోయారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా అధికారుల నుంచి స్పందన లేదని ఆరోపించారు. ఇద్దరు కాంట్రాక్టర్లు ఒంటిపై కిరోసిన్పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
కోపంతో ఊగిపోయిన కొందరు కమిషనర్ చాంబర్లోకి వెళ్లేందుకు యత్నించగా కమిషనర్ఇలంబర్తి మేయర్చాంబర్లోకి వెళ్లి కూర్చున్నారు. అనంతరం పలువురు కాంట్రాక్టర్లతో కమిషనర్ చర్చలు జరిపారు. బల్దియా ఖజానాలో నిధులు లేవని, ప్రభుత్వం ప్రతి నెలా రూ.500 కోట్లు ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు. గతేడాది జనవరి నుంచి జులై నెల వరకు చేసిన పనులకు ఈ నెల 20లోపు రూ.200 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. విడతల వారీగా పెండింగ్బిల్లులను చెల్లిస్తామని చెప్పడంతో కాంట్రాక్టర్లు శాంతించారు.