నెట్వర్క్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు కోసం పథకాలకు సంబంధించి అర్హుల ఎంపికకు జరుగుతున్న గ్రామ, వార్డు సభల్లో ప్రజలు ఆందోళనలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో జాబితాలో తమ పేర్లు రాలేదంటూ ఆందోళన చేశారు.
గన్నేరువరం, వెలుగు : గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో పథకాల లిస్టులో అర్హుల పేర్లు రాలేదంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈక్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తమకు గుంట భూమి కూడా లేదని ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదంటూ ఓ మహిళ కన్నీరుమున్నీరైంది.
హుజూరాబాద్ రూరల్ : రాంపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో తమ పేర్లు రాలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
కొడిమ్యాల : కొడిమ్యాల మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావలసిన గ్రామసభ 10 గంటలకు కూడా ప్రారంభం కాకపోవడంతో అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా తన అప్లికేషన్ కనిపించడం లేదని గ్రామానికి చెందిన చెన్న దేవయ్య గ్రామసభ మధ్యలోనే పడుకొని నిరసన తెలిపారు.
రామడుగు : ఇష్టానుసారంగా లిస్టు తయారుచేశారని రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు గ్రామసభను అర్ధాంతరంగా ముగించారు.
పోస్టర్‌ను చింపిన కౌన్సిలర్ కొడుకు
జమ్మికుంట : జమ్మికుంట 14వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో కౌన్సిలర్ బోగం సుగుణ కొడుకు వెంకటేశ్ ప్రజాపాలన పోస్టర్‌ను చింపేసి డ్రైనేజీలో పడేశాడు. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకున్నారు.