సాగర్ డ్యామ్‌పై హై టెన్షన్!..ఏపీ వైపు వెళ్లేందుకు నో పర్మిషన్

  • రూల్స్ మారాయంటున్న సీఆర్పీఎఫ్​
  •  డ్యాం ఉద్యోగులపైనా ఆంక్షలు
  • గేట్ల నిర్వహణ మరమ్మతులపై ఎఫెక్ట్ 

హాలియా: నాగార్జున సాగర్ డ్యాంపై హైటెన్షన్ నెలకొంది. నిన్న రాత్రి నుంచి నాగార్జునసాగర్‌ ప్రధాన డ్యాంపై విధులు నిర్వహిస్తున్న ఎన్ఎస్పీ ఉద్యోగులు, ఇంజినీర్లను సీఆర్‌ఫీఎఫ్‌ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో డ్యాంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  గత ఏడాది నవంబరు 29వ తేదీ అర్ధరాత్రి ఏపీ పోలీసులు, నీటి పారుదలశాఖ అధికారులు సాగర్‌ ప్రధాన డ్యాంపైకి వచ్చి 13వ నంబరు గేటు వరకు ఏపీ పరిధిలోకి వస్తుందంటూ ముళ్ల కంచెను, బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసు బలగాలతో ఏపీ తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో డ్యాంకు ఇరువైపులా ఏపీ, తెలంగాణ పోలీసు బలగాలు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకుని గత డిసెంబర్ 3న ప్రధాన డ్యాంపై ఏపీ, తెలంగాణకు ఇరువైపులా సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో సాగర్‌ డ్యాంను సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి జనవరి 17వ తేదీ వరకు తెలంగాణ అధికారులను ప్రధాన డ్యాంకు కుడివైపున 13వ నంబరు గేటు అవతలికి సాధారణంగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారే తప్పా, విధులు నిర్వహించేందుకు మాత్రం ఏపీ పరిధిలో ఉన్న కంట్రోల్‌ రూం వద్దకు కూడా రానివ్వలేదు. 

జనవరి 17న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం తరువాత.. సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదు. అప్పటి నుంచి నిబంధనలు మారాయంటూ సీఆర్పీఎఫ్ బలగాలు ఎన్ఎస్పీ సిబ్బంది, అధికారులను ఏపీ వైపు వెళ్లకుండా 13వ నంబరు గేటు వద్దే నిలిపి వేస్తున్నారు. ఏపీ వైపు ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు తెలంగాణ ఉద్యోగులను అనుమతించడం లేదు.

డ్యామ్ నిర్వహణ పనులపై ప్రభావం..

జల వివాదం కొలిక్కి రాకపోవడంతో నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనేది నేటికీ స్పష్టత లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ నీటి సంవత్సరం (జూన్‌ నుంచి మే వరకు) ప్రారంభం కావడానికి మరో ఐదు నెలల టైమే ఉండడంతో సాగర్‌ ప్రధాన డ్యాం నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రధాన డ్యాంపై కుడికాల్వ గేట్లపైన, సూట్‌ గేట్లు, క్రస్ట్‌ గేట్లకు గ్రీసింగ్‌, రబ్బరు సీళ్ల మరమ్మతులు, రూఫ్‌లకు సర్వీసింగ్‌ చేయడంవంటి పనులు చేయాల్సి ఉంది.తమ అధీనంలో ఉన్న 13వ గేటు వరకే ప్రాజెక్టు నిర్వహణ పనులు చేస్తున్నామని, డ్యాం మొత్తం అప్పగిస్తే తప్ప పూర్తి చేయలేమని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. దీంతో జూన్‌లో ఎగువ నుంచి వరదలు వస్తే పరిస్థితేంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.