వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది.. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం దగ్గర ఓ తాగుబోతు హల్చల్ చేశాడు.. ఆదివారం ( ఫిబ్రవరి 2, 2025 ) తెల్లవారుజామున గంగాధర్ అనే వ్యక్తి తప్పతాగి ముద్రగడ ఇంటి దగరికి ట్రాక్టర్ తో వచ్చి బీభత్సం సృష్టించాడు. కాంపౌండ్ వాల్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లి.. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ.. పార్కింగ్ చేసిన కారును ఢీకొట్టి ధ్వంసం చేసి ప్లెక్సీలు చించేశాడు.
ఇది చాలదన్నట్లు గేటును ఢీకొట్టి, ర్యాంప్ దగ్గర ఉన్న కారును కూడా ఢీకొట్టి విధ్వంసం సృష్టించాడు. భారీ శబ్దాలకు ముద్రగడ ఇంట్లోని వ్యక్తులు మేల్కొనడంతో అక్కడి నుండి పారిపోయాడు తాగుబోతు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ముద్రగడ నివాసానికి చేరుకొని.. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడ్ని జగపతి నగరానికి చెందిన యువకుడు గంగాధర్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది తగిన మైకంలో చేసిన చర్యనా లేక దీని వెనక ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై ముద్రగడ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.