మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం.. జగదీశ్ రెడ్డిపై వేటేనా ?

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం.. జగదీశ్ రెడ్డిపై వేటేనా ?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి బెదిరించినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. జగదీశ్ రెడ్డి కామెంట్స్పై అధికార కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. స్పీకర్తో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జగదీశ్ రెడ్డి స్పీకర్ను అవమానించారని, స్పీకర్కు జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. సభలో జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.

సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఈ సభ మీ సొంతం కాదని స్పీకర్పై జగదీశ్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. దళిత స్పీకర్ ను జగదీశ్ రెడ్డి అవమానించారని, స్పీకర్ను అవమానించిన జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జగదీశ్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.

Also Read : బీఆర్ఎస్ కు దళిత స్పీకర్ పై గౌరవం లేదు

దళిత స్పీకర్ను బీఆర్ఎస్ పదేపదే అవమానిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుడి సభ్యత్వం రద్దుపై ఎథిక్స్ కమిటీకి పంపుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పారు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ సభ్యత్వం రద్దు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. స్పీకర్ ను ఏకవచనంతో ఉద్దేశించి మాట్లాడతారా అని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, ఈ సెషన్ వరకు సభ్యుడిని సస్పెండ్ చేయాలని భట్టి విక్రమార్క స్పీకర్ను కోరారు.