
- నియోజకవర్గంలో బాల్క సుమన్ అనుచరుల ఆగడాలు
- పలుచోట్ల తలుపులు మూసి పోలింగ్
- పోలింగ్ బూత్‌ల వద్ద గులాబీ కండువాలతో ప్రచారం
- టైమ్ ముగిశాక పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి తిష్ట
- కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అడుగడుగునా అడ్డంకులు
- చోద్యం చూసిన పలువురు ఆఫీసర్లు, పోలీసులు
- ఓటమి భయంతోనే బాల్క సుమన్ అక్రమాలు: వివేక్
చెన్నూర్, వెలుగు: ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరుల ఆగడాలు శ్రుతిమించాయి. కాంగ్రెస్‌నేతలను, ఏజెంట్లను అడుగడుగునా అడ్డుకొని దాడులకు యత్నించడం, పోలింగ్‌బూత్‌ల వద్ద బీఆర్ఎస్కండువాలు వేసుకుని ప్రచారం చేయడం, టైమ్ ముగిశాక పోలింగ్‌కేంద్రాల్లో తిష్టవేయడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు. వాళ్లను ఎన్నికల అధికారులు, పోలీసులు అడ్డుకోవాల్సిందిపోయి అండగా నిలవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మూడుచోట్ల డోర్లు మూసి పోలింగ్..
చెన్నూర్ మండలం పొన్నారం, కొమ్మెర, దుగ్నెపల్లి గ్రామాల్లోని బూత్ లలో డోర్లు మూసి పోలింగ్ నిర్వహించడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ దుగ్నేపల్లి గ్రామానికి చేరుకోగా, బాల్కసుమన్అనుచరులు ఆయనను అడ్డుకున్నారు. తాను ఏజెంట్‌నని, పోలింగ్‌బూత్‌లను పరిశీలించేందుకు తనకు అనుమతి ఉందని వంశీకృష్ణ చెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్‌బూత్‌లోకి అనుమతించాలని పోలీసులు చెప్పినా ఎమ్మెల్యే అనుచరులు వినిపించుకోలేదు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. పోలింగ్ ఆఫీసర్ల తీరుపై మండిపడ్డారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా డోర్లు మూసి పోలింగ్ ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. కొందరు ఆఫీసర్లు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వాళ్లపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ బూత్ లోకి ఓటర్లు పెద్ద సంఖ్యలో చొచ్చుకురావడంతో కంట్రోల్ చేయలేకనే డోర్లు క్లోజ్ చేశామని అధికారులు చెప్పగా, రాష్ట్రంలో మరెక్కడా లేని పరిస్థితి ఇక్కడే ఎందుకు వచ్చిందని వంశీకృష్ణ ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కాగా, చెన్నూర్‌లోని పలు పోలింగ్‌బూత్‌ల వద్ద బాల్క సుమన్ అనుచరులు బీఆర్ఎస్ కండువాలు వేసుకుని ప్రచారం చేశారు. మందమర్రి మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కారు గుర్తుతో కూడిన ఈవీఎం నమూనాను ప్రదర్శించి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నంచేయగా, కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. కానీ అధికారులెవరూ పట్టించుకోలేదు.
పోలింగ్ కేంద్రానికి నంబర్ ప్లేట్ లేని కారు..
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం ముందు పోలీసులకు, కాంగ్రెస్ లీడర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. 134 పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవుల సురేశ్ పోలింగ్ ఏజెంట్ గా ఉన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ఆఫీసర్లు కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ లను సీల్ చేశారు. పోలింగ్ ఏజెంట్లను పోలీసులు బయటకు పంపించారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు నంబర్ ప్లేట్ లేని కారును పోలింగ్ కేంద్రం ముందు ఆపి లోపలికి వెళ్లారని కాంగ్రెస్ శ్రేణులకు సమాచారం అందింది. దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామితో కలిసి స్కూల్ దగ్గరికి చేరుకున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత సెంటర్లోకి బీఆర్ఎస్ లీడర్లను ఎలా అనుమతించారని ఆఫీసర్లు, పోలీసులపై వివేక్‌వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెంట్రల్ పోలీసులతో భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్కార్యకర్తలు ‘ఆఫీసర్లు, పోలీసులు డౌన్ డౌన్’ అంటూ నినదించారు. బీఆర్ఎస్ లీడర్లకు పోలీసులు తొత్తులుగా మారారని మండిపడ్డారు. ‘‘ఉదయం పోలింగ్‌కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ లీడర్లు చేకుర్తి సత్యనారాయణరెడ్డి, పోడేటి రవి, పోటు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్ 144 సెక్షన్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కేసులు పెడ్తానని ఎస్ఐ రాజవర్ధన్ బెదిరించారు. కానీ బీఆర్ఎస్ లీడర్లు పోలీసుల ముందే ఓటర్లకు డబ్బులు పంచినా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఎస్సై రాజవర్ధన్‌ను సస్పెండ్ చేయాలి” అని వివేక్ డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ భీమారం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈవీఎంల తరలింపులోఆలస్యంపై ఆరా తీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని డీసీపీహామీ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన విరమించారు.
ఓటమి భయంతోనే బాల్క సుమన్ అక్రమాలు: వివేక్
కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ గా ఓట్లు పోలవడంతో ఎమ్మెల్యే బాల్కసుమన్కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే బాల్క సుమన్, ఆయన అనుచరులు అక్రమాలకు పాల్పడ్డారని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌వెంకటస్వామి అన్నారు. దుగ్నెపల్లి, కొమ్మెర, పొన్నారం తదితర గ్రామాల్లో పోలింగ్‌బూత్‌ల డోర్లు మూసి ఎన్నికలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. కొందరు ఎన్నికల అధికారులు, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఇలాంటి ఆఫీసర్లు, పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, వివేక్మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్స్కూల్ లో ఓటు వేయగా.. ఆయన సతీమణి సరోజా వివేక్, కుమారుడు వంశీకృష్ణ మంచిర్యాల మార్కెట్ రోడ్డు లోని గర్ల్స్ హైస్కూల్ లో ఓటు వేశారు.