ఢిల్లీ బార్డర్‎లో హై టెన్షన్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం​

ఢిల్లీ బార్డర్‎లో హై టెన్షన్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం​

శంభు (న్యూఢిల్లీ): పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు ఎంఎస్ పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హర్యానా బార్డర్‎లో ఉన్న శంభుకు చేరుకున్న 101 మంది రైతుల బృందం(జాతా).. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీకి బయల్దేరింది. జాతీయ జెండాలు పట్టుకున్న వందలాది మంది రైతులు వీరిని అనుసరించారు. అయితే, కొన్ని మీటర్ల దూరంలోనే పోలీసులు పెద్ద సంఖ్యలో బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటుచేసి అడ్డుకున్నారు. 

దీంతో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రైతులు చెల్లాచెదురు అయ్యారు. ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చివరికి ‘ఢిల్లీ చలో’ మార్చ్​ను తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు కిసాన్ మజ్దూర్ యూనియన్ (కేఎంఎం), సంయుక్త్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) ప్రకటించింది.

వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల మాఫీ, పెంచిన విద్యుత్ టారిఫ్‎ల నుంచి రక్షణ కల్పించాలంటూ రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. సంయుక్త కిసాన్‌‌ మోర్చా నేతృత్వంలో వందలాది మంది రైతులు పంజాబ్–హర్యానా బార్డర్​లోని శంభుకు చేరుకున్నారు. ఆయా రైతు సంఘాల జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. శంభు బార్డర్ గుండా ఢిల్లీలోకి ప్రవేశించేందుకు శుక్రవారం ప్రయత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, ముళ్ల కంచెలను ఎత్తి.. ఘగ్గర్ నదిపై నిర్మిస్తున్న వంతెన పై నుంచి కిందపడేశారు. 

ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ముందుకు దూసుకెళ్లారు. అలర్ట్ అయిన పోలీసులు.. తిరిగి వెళ్లిపోవాలని రైతులకు సూచించారు. ఢిల్లీలో ఎంట్రీకి పర్మిషన్ లేదని హెచ్చరించారు. అయినప్పటికీ రైతులు ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నది. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పలువురు రైతులు అస్వస్థతకు గురయ్యారు. మరికొందరు గాయపడ్డారు. దీంతో, వారిని హాస్పిటల్​కు తరలించారు. 

11 గ్రామాల్లో మొబైల్ ఇంటర్​నెట్ బంద్​

‘ఢిల్లీ చల్’ మార్చ్ నేపథ్యంలో హర్యానా పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించారు. అదనంగా మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 163 సెక్షన్ విధించారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడొద్దని అంబాలా డిస్ట్రిక్ట్​ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 11 గ్రామాల్లో ఈ నెల 9 వరకు మొబైల్​ ఇంటర్నెట్ సేవలను హర్యానా ప్రభుత్వం నిలిపేసింది. బల్క్ ఎస్ఎంఎస్​లు పంపకుండా ఆంక్షలు విధించింది.

త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం: రైతు సంఘాలు

‘ఢిల్లీ చలో’ మార్చ్ ను పోలీసులు అడ్డుకోవడంతో కిసాన్ మజ్దూర్ యూనియన్ (కేఎంఎం), సంయుక్త్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఆరుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వృద్ధ రైతులు అస్వస్థతకు గురయ్యారన్నారు. ఈ నేపథ్యంలో ‘ఢిల్లీ చలో’ మార్చ్​ను తాత్కాలికంగా విరమించుకున్నట్లు ప్రకటించారు. అన్ని రైతు సంఘాల నేతలు సమావేశమై.. తదుపరి కార్యాచరణపై చర్చిస్తామన్నారు. శాంతియుతంగా ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులే బారికేడ్లు, ముళ్ల కంచెలతో అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. తమ డిమాండ్లు నెరవేర్చే దాకా ఆందోళనలు ఆగవని హెచ్చరించారు.

మోదీ గ్యారంటీ అమలు చేస్తం.. 

అన్ని పంటలకు కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్ ప్రకటించారు. క్వశ్చన్ అవర్​లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘రైతులు పండించిన అన్ని పంటలకు ఎంఎస్​పీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా ప్రకటిస్తున్నాను. మోదీ గ్యారంటీని కచ్చితంగా అమలు చేసి తీరుతాం. 

ఉత్పత్తి ధరకంటే కనీసం 50శాతం అధికంగా చెల్లించి పంటను కొనుగోలు చేయాలన్న ఎంఎస్‌‌ స్వామినాథన్‌‌ కమిషన్‌‌ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేమని గతంలో కాంగ్రెస్‌‌ చెప్పింది. కానీ, మోదీ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం, గోధుమలు, సోయాబీన్‌‌, జొన్న పంటలకు ఉత్పత్తి ధరకంటే 50 శాతం అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నది’’అని శివరాజ్​సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.